టీచర్ ఉద్యోగాలకు టెట్.. లెక్చరర్ పోస్టులకు నెట్ తప్పనిసరి
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:44 AM
టెట్, నెట్ పరీక్షల్లో పాస్ కానివారిని ఉపాధ్యాయులు, లెక్చరర్లుగా నియమించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది....
అసోంకు సంబంధించిన ఓ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: టెట్, నెట్ పరీక్షల్లో పాస్ కానివారిని ఉపాధ్యాయులు, లెక్చరర్లుగా నియమించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, యూజీసీ చట్టాల ప్రకారం నిర్దేశిత అర్హతలు లేని ఏ ఒక్కరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించకూడదని స్పష్టం చేసింది. అసోంలో 2017లో తీసుకువచ్చిన ఉపాధ్యాయుల సేవల క్రమబద్ధీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు అభ్యర్థులు.. డీఎల్‌ఈడీ/బీ.ఎడ్‌తో పాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలని, ఉన్నత విద్యా సంస్థల్లో లెక్చరర్ల నియామకాలకు అయితే పీజీతో పాటు నెట్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలని తెలిపింది. అర్హతలు లేని ఉపాధ్యాయులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలాంటి వారిని నియమిస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు