రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:11 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి గెలవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’ పైనా, రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లారని విమర్శించారు.
అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి గెలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’ పైనా, రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లారని విమర్శించారు. ఈరోజు (మంగళవారం) మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని నిర్ణయించామని అన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలనే ఈ ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. బెస్ట్ అభ్యర్థులను నిలిపేలా ప్రతి ఒక్కరం జాగ్రత్త పడాలని సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం లేకుండా చూడాలని నిర్దేశించారు.
పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా ఆభ్యర్థుల ఎంపిక జరగాలని ఆదేశించారు. ఆయా కమిటీల ద్వారా ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందుకెళ్దామని సూచించారు. గెలుపే ధ్యేయంగా పనిచేయటంతో పాటు కూటమిగా బ్యాలెన్సింగ్ జరగాలని మార్గనిర్దేశం చేశారు. విశాఖపట్నం నార్త్ మినహా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించామని తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలని ఆదేశించారు. పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే సస్పెన్షన్ వేటు పడుతుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మనం అంతా స్పూర్తితో కలసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిద్దామని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.