Share News

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:24 PM

స్వర్ణభారత్ ట్రస్ట్‌పై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రశంసలు కురిపించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ 25ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
UP CM Yogi Adityanath

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): స్వర్ణభారత్ ట్రస్ట్‌పై (Swarna Bharat Trust) ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ (UP CM Yogi Adityanath) ప్రశంసలు కురిపించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ 25ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. సమాజం కోసం ఈ ట్రస్ట్ తీసుకున్న సంకల్పం ఎంతో గొప్పదని కొనియాడారు. ఈరోజు (సోమవారం) నెల్లూరులోని వెంకటాచలంలో ఘనంగా స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఎంపీ బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రసంగించారు. ‘అందరికీ ధన్యవాదాలు.. మీ స్వాగతాలకు ధన్యవాదాలు... మీ మధ్యకు రావడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ తెలుగులో ప్రసంగించారు.


వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఎంతో పేరు గడించారు

ఈ ట్రస్ట్ ఏర్పాటుకు వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయకంగా నిలవడం అభినందనీయమని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. ఆయన దేశవ్యాప్తంగా ఎంతో పేరు గడించారని కొనియాడారు. వెంకయ్యనాయుడు అందరితో‌ కలిసిమెలిసి కలివిడిగా ఉంటారని తెలిపారు. రాజ్యసభ అధ్యక్షుడుగా అందరినీ కలుపుకెళ్లారని అన్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు సంస్కృతి వారధిగా ఆయన పనిచేశారని ప్రశంసించారు. ఇరవై ఐదేళ్ల క్రితం స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభమైందని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయాణం అప్పుడే మొదలైందని తెలిపారు. ఇద్దరి లక్ష్యం వికసిత్ భారత్ ఇవాళ ఆవిష్కృతమైందని ఉద్గాటించారు. గ్రామాలు జ్ఞానానికి, మూలాలకు, ఆర్థిక అభివృద్ధికి‌‌ కేంద్రాలుగా ఉన్నాయని వివరించారు. ఉత్పాదక, విక్రయాలు గ్రామాల్లోనే జరిగేవని వెల్లడించారు. గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి కాస్త వెనకపడిందన్నారు. అయినా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ అప్పట్లో గ్రామాలకు తరలి రావాలనే పిలుపునిచ్చారని పేర్కొన్నారు.


ఆ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం..

గ్రామీణ అభివృద్ధితో పాటు మహిళాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి స్వర్ణభారత్ ట్రస్ట్ పాటుపడుతోందని యోగి ఆదిత్యానాథ్ కొనియాడారు. చదువులకు దూరమైన పిల్లలకు చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జాతి నిర్మాణానికి పాటుపడటమేనని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో పేద, నిరుపేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. బాషలు, ప్రాంతాలు వేరైన లక్ష్యం ఒక్కటేనని తెలిపారు. పిల్లల్లో దేశభక్తి పెరగాలని.. ఏ దేశానికి వెళ్లినా భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పిస్తున్నామని వివరించారు. కులవృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నామని.. మహిళలకు స్వయం ప్రవృత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గో సంరక్షణ చేపట్టే వారికి నెలకు రూ.1500లను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని స్పష్టం చేశారు. యూపీలో 25 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఉన్నారని చెప్పారు. గతంలో మరుగుదొడ్లు లేక, అనారోగ్యాలతో వేలమంది‌ చనిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని‌ మోదీ తీసుకువచ్చిన స్వచ్ఛభారత్‌తో వ్యక్తిగత మరుగుదొడ్లు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో అనారోగ్య మరణాలు ఆగిపోయాయని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్

పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు

వంగవీటి రాధాను పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 05:27 PM