Share News

చివరి గంట మోగింది.. పాఠశాల ప్రాంగణం మార్మోగింది.!

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:43 PM

దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే పాఠశాల.. వేలాది మంది విద్యార్థులతో అనుబంధం.. రోజూ మోగించే ఆ గంటతో విడదీయరాని బంధం! చివరి రోజు ఆ అటెండర్ గంటను ఆఖరుసారిగా మోగించగానే విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో పాఠశాల ప్రాంగణం మార్మోగిపోయింది. సుదీర్ఘకాలం ఆయన అందించిన సేవకు విద్యార్థులు, ఉపాధ్యాయులిచ్చిన ఈ ఆత్మీయ వీడ్కోలు చూపరులను కదిలిస్తోంది.

చివరి గంట మోగింది.. పాఠశాల ప్రాంగణం మార్మోగింది.!
Anand Mahindra shares touching farewell of Bengaluru school attendant

ఇంటర్నెట్ డెస్క్: పాఠశాలలో పనిచేసే ఓ అటెండర్ ఉద్యోగం ముగిసింది.. కానీ 38 ఏళ్ల అనుబంధానికి మాత్రం ముగింపు పలకడం అంత సులభం కాలేదు. బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు సేవలందించిన 'దాస్(దాస్ అంకుల్‌)' అనే ఉద్యోగికి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని వివరాల ప్రకారం.. పాఠశాలలో దాస్‌కు అదే చివరి రోజు. ఆయన ఎప్పటిలాగే తన చేతి గడియారం చూసుకుని, చివరిసారిగా లాంగ్ బెల్ మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో విద్యార్థులంతా ఏకమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. లాస్ట్ బెల్ మోగగానే పాఠశాల మొత్తం చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయింది. ఉపాధ్యాయులు కూడా ఈ భావోద్వేగ క్షణంలో విద్యార్థులతో కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.


ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ దృశ్యాలను తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడాది తర్వాత వీడియో తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 38 ఏళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేసిన దాస్ అంకుల్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇచ్చిన గౌరవం తనను కదిలించిందని పేర్కొన్నారు. 'ఒక చివరి గంట.. జీవితకాల సేవ' అంటూ మహీంద్రా ఈ ఘటనను అభివర్ణించారు. ఆ సమయంలో దాస్ అంకుల్‌ ముఖంలో కనిపించిన గర్వం, పాఠశాలతో ఆయనకున్న అనుబంధం స్పష్టంగా కనిపించాయని చెప్పుకొచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరి సేవకు గుర్తింపు, గౌరవం లభించాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటిచెప్పిందని పేర్కొన్నారు. పాఠశాలలో పనిచేసే ప్రతి వ్యక్తిని వారి హోదాతో సంబంధం లేకుండా గౌరవించే సంస్కారం విద్యార్థుల్లో పెంపొందితే భవిష్యత్తుపై ఆశాభావం కలుగుతుందన్నారు మహీంద్రా.


ఈ వీడియోపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. 38 ఏళ్ల పాటు నిజాయతీగా సేవలందించిన వ్యక్తికి ఇంతటి ఆత్మీయ వీడ్కోలు లభించడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ సేవాకాలంలో అవమానాలు, మందలింపులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని గుర్తుచేస్తూ.. అయినప్పటికీ వారి సేవను గుర్తించడం ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

పిరికి జడ్జి అనిపించుకోవడం కన్నా చావడం మేలు

టీచర్‌ ఉద్యోగాలకు టెట్‌.. లెక్చరర్‌ పోస్టులకు నెట్‌ తప్పనిసరి

Updated Date - Sep 09 , 2026 | 04:54 PM