ఎర్రకోటే లక్ష్యం.. ఏళ్ల ముందే రెక్కీ.. ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో కీలక వివరాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:11 PM
దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో జరిగిన బాంబు పేలుడు.. ఆత్మాహుతి దాడేనని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. నిందితుడు ఉమర్ ఉన్ నబీ కారులో ఉండగానే పేలుడు పరికరాన్ని యాక్టివేట్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్ 10న జరిగిన బాంబు పేలుడు.. ఆత్మాహుతి దాడేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. నిందితుడు ఉమర్ ఉన్ నబీ కారులో ఉండగానే పేలుడు పరికరాన్ని(ఐఈడీ) యాక్టివేట్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్న కుట్ర, నిందితుల కదలికలు, వారికి లభించిన సిద్ధాంత, కార్యాచరణపరమైన సమాచారాన్ని ఎన్‌ఐఏ ప్రస్తావించింది. ఈ కేసును అన్సార్ గజ్వత్-ఉల్-హింద్(ఏజీయూహెచ్) మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్టుగా తేల్చింది.
ఎన్‌ఐఏ తెలిపిన ప్రకారం.. పేలుడు జరిగిన సమయంలో ఉమర్ ఉన్ నబీ కారులోనే ఉన్నాడని తేలింది. అతడే నిర్దిష్ట కమాండ్ ద్వారా ఐఈడీని ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీంతో ఇది ఆత్మాహుతి దాడేనని నిర్ధారించినట్లు తెలిపింది. ఎర్రకోటను లక్ష్యంగా చేసుకోవాలనే ఆలోచన అప్పటికప్పుడు వచ్చినది కాదని కూడా ఎన్ఐఏ పేర్కొంది. 2023 డిసెంబరు నుంచే నిందితులు పలుమార్లు ఆ పరిసరాలను పరిశీలించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఉమర్ ఇతర నిందితులతో కలిసి పలుమార్లు అక్కడికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే.. దాడికి ముందుగా నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదన్న ఎన్ఐఏ.. ఆ సమూహంలోని కొందరు శ్రీనగర్‌లో అరెస్ట్ అయ్యారనే భయంతో దాడిని వేగవంతం చేశాడని ఆరోపించింది.
నిందితులు తీవ్రవాద భావజాల సంబంధిత కార్యకలాపాలకు ప్రభావితమయ్యారని కూడా ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం 'లోన్ ముజాహిద్ పాకెట్ బుక్/హౌ టూ బికమ్ యాన్ అసాసిన్' పేరిట ఉన్న ఓ డాక్యుమెంట్‌ను కూడా ప్రస్తావించింది. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, రహస్య కార్యకలాపాలు, ఐఈడీలకు సంబంధించిన అంశాలు అందులో ఉన్నట్లు తెలిపింది. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలను హింసాత్మకంగా కూల్చేయాలని ప్రోత్సహించే భావజాలం కూడా అందులో ఉన్నట్లు ఆరోపించింది ఎన్‌ఐఏ. డెమోక్రసీని రిజెక్ట్ చేసి, షరియా పాలనను కోరుతూ రాసిన హ్యాండ్‌రైటింగ్ నోట్స్ కూడా అల్-ఫలాహ్ ఫ్లాట్‌లో లభ్యమైనట్టు తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
భారత రాజ్యానికి ప్రతీకగా భావించే ఎర్రకోటను లక్ష్యంగా చేసుకున్నట్టు ఎన్ఐఏ వివరించింది. నిందితుల వద్ద లభించిన డాక్యుమెంట్స్ తీవ్రవాద భావజాలానికి సంబంధించినవే కాకుండా.. రహస్య కార్యకలాపాలను నిర్వహించే విధానం, ఐడెంటిటీలను మార్చడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకునే విధానం వంటి అంశాలెన్నో ఉన్నాయని తెలిపింది.
ఇవీ చదవండి:
'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'
భారతరత్నకు ‘సర్’ కష్టాలు.. పేరులో ఒక అక్షరం అదనంగా ఉండడంతో..