Share News

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:57 AM

ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగత సంభాషణలు చాలా పరిమితమని సోనియా గాంధీ వెల్లడించారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో మోదీతో పరిచయం, పరస్పర పలకరింపులు, భారత్‌పై ఇద్దరి భిన్నమైన రాజకీయ ఆలోచనలు, నెహ్రూపై బీజేపీ వైఖరి గురించి ప్రస్తావించారు.

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ
Have No Real Contact With PM Modi says Sonia Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఇప్పటివరకు పెద్దగా వ్యక్తిగత సంభాషణలేమీ జరగలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పరస్పరం నమస్కారం మాత్రమే చేసుకుంటామన్న ఆమె.. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడేటప్పుడు కళ్లలోకి కాకుండా పక్కకు చూస్తారని పేర్కొన్నారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించారు సోనియా (Belonging: A Journey Of Love).


పార్లమెంట్‌ సమావేశాల ముగింపు వేళ స్పీకర్‌ ఛాంబర్‌లో జరిగే సమావేశాల్లో నేతలంతా కలుస్తుంటారన్న సోనియా.. అక్కడ మోదీ ఎదురైతే ఓ నమస్కారంతో సరిపెడతారన్నారు. గతంలో భిన్న రాజకీయ పార్టీ నేతల మధ్య కూడా పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణం ఉండేదని గుర్తుచేశారు. మోదీతో తనకు పెద్దగా సంభాషణలు లేకపోయినప్పటికీ.. పరస్పరం పుట్టినరోజు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మాత్రం చెప్పుకుంటామని తెలిపారు. తాను ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన సందర్భాల్లోనూ మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని, అందుకు తాను కృతజ్ఞతలు తెలిపానని వివరించారు.


'మా ఆలోచనలు పూర్తి భిన్నం'

అయితే.. దేశం పట్ల మోదీకి, తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలున్నాయని చెప్పుకొచ్చారు సోనియా. తన దృష్టిలో భారత్‌ అంటే భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు, మతాలు కలిసిమెలిసి జీవించే లౌకిక, సమానత్వ దేశమని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సమ్మిళితత్వం తన భారతీయ భావనకు పునాదులని చెప్పారు. కానీ.. మోదీ దృక్పథం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తల ఆలోచనలు, ఆయన వ్యక్తిగత అనుభవాల ద్వారా రూపుదిద్దుకుందని విమర్శించారు. ఆ దృక్పథంలో ఒక మతం, సంస్కృతికి ఇతరులకంటే ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇది వ్యక్తిగత విభేదం కాదని, దేశ భవిష్యత్తుపై ఉన్న భిన్నమైన ఆలోచనల మధ్య పోరాటమని ఆమె పేర్కొన్నారు.


ఇక.. పార్లమెంట్‌లోనూ మోదీ ప్రతిపక్షాలనుద్దేశించి తరచూ కఠిన భాష ఉపయోగిస్తుంటారని కాంగ్రెస్ అధినేత్రి ఆరోపించారు. ముఖ్యంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై బీజేపీ వైఖరిని ఆమె తప్పుబట్టారు. నెహ్రూ దేశాన్ని ప్రజాస్వామ్య, లౌకిక మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' అనే బీజేపీ నినాదం వెనుక కాంగ్రెస్‌ పార్టీతో పాటు దాని విధానాలు, సిద్ధాంతాలను కూడా అంతం చేయాలనే ఆలోచన ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం మతపరమైన విభజనకు దారితీస్తోందని విమర్శించారు. మొత్తంగా మోదీతో తన వ్యక్తిగత పరిచయం పరిమితంగానే ఉన్నప్పటికీ.. దేశం పట్ల ఇద్దరి ఆలోచనలు, రాజకీయ సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమని తన పుస్తకంలో విశ్లేషించారు సోనియా.


ఇవీ చదవండి:

మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు

హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 10 , 2026 | 12:02 PM