ఎన్విడియా అధినేతకు బిగ్ షాక్.. ఒక్కరోజే 7.4 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి.!
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:31 AM
ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ సంపదలో భారీ నష్టం వాటిల్లింది. ఈ నెల 9న ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అరగంటలోనే 7.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 8 నుంచి 10వ స్థానానికి పడిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా(NVIDIA) అధినేత జెన్సన్ హువాంగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానం ఉన్న జెన్సన్ హువాంగ్‌కు వ్యక్తిగత వివాదం, కంపెనీ చుట్టూ నెలకొన్న పరిణామాలు ఒక్కసారిగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. చైనాకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలున్న ఓ వ్యాపారవేత్తతో ఆయనకు సంబంధాలున్నట్లు వార్తలు రావడం, ఆ తర్వాత తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరించడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో ఎన్విడియా షేర్లలో ఒత్తిడి నెలకొనడంతో ఆయన సంపద భారీగా పడిపోయింది.
ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఈ నెల 9న ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అరగంటలోనే హువాంగ్ సంపద 7.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ.6,600 కోట్లకు పైగా) తగ్గి 154.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 8 నుంచి 10వ స్థానానికి పడిపోయారు. వారెన్ బఫెట్, లారీ ఎల్లిసన్ ఆయన్ను అధిగమించారు. అంతకుముందు ఈ నెల 6న కూడా టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా ఆయన సంపద 15.1 బిలియన్ డాలర్లు పతనమైనట్టు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
కాగా.. జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియాలో 3.5 శాతానికి పైగా వాటా ఉంది. ఆయన సంపదలో అత్యధిక భాగం కంపెనీ షేర్ల విలువపైనే ఆధారపడి ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లో స్వల్ప మార్పులు వచ్చినా ఆయన ఆస్తుల విలువ బిలియన్ల డాలర్ల మేర మారిపోతోంది. షేర్లు కోలుకుంటే సంపద తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి కంపెనీపై జరుగుతున్న దర్యాప్తు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం.. ఈ రెండూ హువాంగ్‌కు సవాళ్లుగా మారాయి.
చైనాకు సమాచారం చేరవేసేందుకు యత్నించినట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానించిన ఓ వ్యాపారవేత్తతో హువాంగ్‌కు సంబంధాలున్నాయంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. తన వ్యక్తిగత సంబంధం కారణంగా భార్య, పిల్లలు బాధపడినందుకు ఉద్యోగులకు పంపిన సందేశంలో హువాంగ్ విచారం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు.
ఇవీ చదవండి:
ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా సీఈఓతో సంబంధాలేంటి?
హెగ్సెత్కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు