Share News

మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 07:51 AM

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. 2013లో పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు
Mamata Benarjee

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2013లో పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరుతూ.. ఈ నోటీసులు అందజేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ) సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణాధికారిని ఎప్పుడు, ఎక్కడ కలవాలన్నది ఆమె సౌకర్యానుసారం నిర్ణయించుకోవచ్చని సూచించారు.


అసలేం జరిగిందంటే?

2013లో ఢిల్లీలోని నాటి ప్రణాళికా సంఘం కార్యాలయం సమీపంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో మమత తన పార్టీ నేతలు, మంత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆమె బృందాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై దాడి చేసి, దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రాగా.. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ఉద్యోగులపై దాడి చేయడం, అల్లర్లు సృష్టించడం వంటి అభియోగాలతో ఐపీసీ సెక్షన్లు 186, 353, 332, 147, 149, 34 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నాటి ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


అయితే.. ఈ కేసులో మమత పాత్రపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన పరిస్థితులపై ఆమెకు అవగాహన ఉందని, అందుకే సాక్షిగా విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై మమత లేదా టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.


ఇవీ చదవండి:

రూ.37 లక్షల జీతం.. 6 నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బ్లూ టిక్స్‌ పడకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

Updated Date - Nov 10 , 2026 | 08:03 AM