Share News

రూ.37 లక్షల జీతం.. 6 నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:43 PM

ఏడాదికి రూ.37 లక్షల వేతనం అందించే టెక్నాలజీ స్టార్టప్ ఉద్యోగానికి 28 ఏళ్ల ఐఐఎం గ్రాడ్యుయేట్ ఆరు నెలల్లోనే రాజీనామా చేశాడు. పని వాతావరణం, యాజమాన్యం వ్యవహారశైలి నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

రూ.37 లక్షల జీతం.. 6 నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

ఇంటర్నెట్ డెస్క్: ఏడాదికి రూ.37 లక్షల భారీ వేతనం.. మంచి హోదా.. అయినా ఉద్యోగం నచ్చకపోవడంతో ఓ యువకుడు రాజీనామా చేశాడు. చేతిలో ఎలాంటి జాబ్ ఆఫర్ లేకుండానే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఓ టెక్నాలజీ స్టార్టప్‌లో చేరిన 6 నెలలకే గుడ్‌బై చెప్పిన 28 ఏళ్ల ఐఐఎం గ్రాడ్యుయేట్.. నాలుగైదు నెలల విరామం అనంతరం మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం.. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.


సదరు యువకుడు ఆర్నెల్ల క్రితం ఓ సిరీస్‌-సీ టెక్నాలజీ స్టార్టప్‌లో ఇంటర్నల్‌ స్ట్రాటజీ, బిజినెస్‌ ఆపరేషన్స్‌ విభాగంలో చేరాడు. అక్కడి పని వాతావరణం, యాజమాన్యం వ్యవహారశైలి నచ్చకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో మరో ఉద్యోగం వెతుక్కోకుండానే రాజీనామా చేసినట్లు వెల్లడించాడు. అయితే.. కొంతకాలం విశ్రాంతి తీసుకుని, వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాలా? లేక వెంటనే మరో జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవాలా? అంటూ నెటిజన్ల సలహా కోరాడు. గతంలో కన్సల్టింగ్‌ రంగంలో పనిచేసిన అనుభవం తనకుందని.. ఇకపై జీతం కాస్త తక్కువైనా సరే నచ్చిన ఉద్యోగాన్నే ఎంచుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.


ఆ యువకుడి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్‌లో అనిశ్చితి, ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న తరుణంలో వెంటనే ఉద్యోగాన్వేషణ ప్రారంభించాలని కొందరు సూచించగా.. ఎక్కువకాలం గ్యాప్ వస్తే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదముందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యమివ్వాలని పలువురు సూచిస్తూ.. ఇష్టంలేని ఉద్యోగంలో కొనసాగుతూ ఒత్తిడికి గురయ్యే బదులు కొంత విరామం తీసుకుని భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత తెచ్చుకోవడం మంచిదని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

Updated Date - Nov 08 , 2026 | 01:58 PM