ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా సీఈఓతో సంబంధాలేంటి.?
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:11 AM
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని ఆలిస్ హువాంగ్ వార్తల్లో నిలిచారు. ఇంతకూ ఎవరీ హువాంగ్? ఆమె నేపథ్యమేంటి.?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటైన ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ చుట్టూ గూఢచర్య ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె చైనా నిఘా సంస్థకు సమాచారం చేరవేస్తున్నారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. ఇప్పుడు ఆలిస్ హువాంగ్ ఎవరనే విషయమై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ ఆలిస్ హువాంగ్?
చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్.. హువాంగ్ లీ అనే పేరుతోనూ గుర్తింపు పొందారు. ఈమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక పదవిలో పనిచేశారు. గతంలో చైనాలోని హునాన్ టీవీ, ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో విలేకరిగా పనిచేసినట్లు ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ, సీఐటీఐసీ సెక్యూరిటీస్ సంస్థల్లోనూ లీ విధులు నిర్వర్తించినట్టు సమాచారం. అయితే.. ఆమె గత ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని వివరాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. హునాన్ టీవీకి చెందిన ఓ అధికారి ఆమె గురించి తమకు తెలియదని చెప్పినట్లు మరో కథనం పేర్కొంది.
అసలేం జరిగింది?
2024 జూన్‌లో తైవాన్‌లోని ఓ బార్‌లో జెన్సన్ హువాంగ్‌తో కలిసి ఆలిస్ కనిపించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో మెగాస్పీడ్ భారీ స్థాయిలో ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్‌ల కొనుగోళ్లు ప్రారంభించినట్లు సమాచారం. రెండేళ్లలో సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమె.. హువాంగ్ వెంట కనిపించారని తెలుస్తోంది. అలా చైనా నిఘా సంస్థకు చెందిన అధికారులు ఆలిస్‌ను నియమించుకుని, ఎన్విడియా అధినేతపై సమాచారం సేకరించడం సహా చైనాకు అత్యాధునిక చిప్‌ల విక్రయాల విషయంలో సంస్థ నిర్ణయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్లు ఓ రహస్య నివేదిక ఆధారంగా కథనాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి:
నా భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: ఎన్విడియా సీఈఓ
ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. అత్యంత అసంభవం: ట్రంప్