Share News

కల్తీ ఆహారంపై కేంద్రం కొరడా.. రూ.81.80 కోట్ల ఆహార పదార్థాల సీజ్

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:19 AM

పండగల వేళ ఆహార కల్తీని అరికట్టేందుకు FSSAI దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు 56,431 కేంద్రాలను పరిశీలించి రూ.81.80 కోట్ల విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేసింది.

కల్తీ ఆహారంపై కేంద్రం కొరడా.. రూ.81.80 కోట్ల ఆహార పదార్థాల సీజ్
Food Safety Body Seizes Banned Items Worth Rs 82 Crore

ఇంటర్నెట్ డెస్క్: పండగల వేళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ఏకంగా రూ.81.80 కోట్ల విలువైన 3,279.57 టన్నుల నిషేధిత, నిబంధనలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.


సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా కొనసాగిన ఈ తనిఖీల్లో 56,431 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. పాలు, నెయ్యి, పనీర్‌, స్వీట్లతో పాటు పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆహార వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నారు. 52 సంస్థల లైసెన్సులను రద్దు చేయగా, మరో 1,133 సంస్థల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ తనిఖీల్లో 314 సంస్థలు మూతపడగా.. ఆయా ఫుడ్ సేఫ్టీ మేనేజర్లకు 10,047 నోటీసులు జారీ చేశారు.


పండగల సమయంలో ఆహార పదార్థాల వినియోగం పెరిగే నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. ఈ ఏడాది ఆహార వ్యాపార సంస్థలతో పాటు ఈ-కామర్స్‌ సంస్థలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం చేసింది.


ఇవీ చదవండి:

'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్‌ దీప్కే జోస్యం

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

Updated Date - Nov 09 , 2026 | 08:37 AM