ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. అత్యంత అసంభవం: ట్రంప్
ABN , Publish Date - Nov 09 , 2026 | 10:07 AM
ఇరాన్‌తో మరోసారి యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఒప్పందం కుదరకపోతే సైనిక దాడులు తప్పవని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో మరోసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశాలు అత్యంత తక్కువ అని అన్నారు. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు, హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశాలపై గట్టి ఒప్పందం కుదరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ డీల్‌కు ఇరాన్ అంగీకరించకపోతే తాము మరోసారి సైనిక దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
పశ్చిమాసియాలో అమెరికా 3 విమాన వాహక యుద్ధనౌకలను మోహరించిందని, అవి పూర్తిస్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా గుర్తించినట్లు వెల్లడించారు. అయితే.. వాటిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి పదేళ్ల సమయం పట్టొచ్చని, అందుకే అలాంటి చర్యలు తీసుకోవడం తనకిష్టం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పశ్చిమాసియా దేశాలు దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఖతార్ రాజుతో ట్రంప్ చర్చలు జరిపారు. మరోవైపు.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, పాకిస్థాన్, టర్కీ సహా పలు దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అయితే.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం చర్చల్లో తక్షణ పురోగతి కనిపిస్తోందని చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
నా భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: ఎన్విడియా సీఈఓ
కల్తీ ఆహారంపై కేంద్రం కొరడా.. రూ.81.80 కోట్ల ఆహార పదార్థాల సీజ్