Share News

850 స్థానాలతో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోంది.. రాహుల్ గాంధీ ధ్వజం

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:18 PM

డీ లిమిటేషన్ బిల్లుపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 850 సీట్ల ప్రతిపాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 850 స్థానాలతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు.

850 స్థానాలతో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోంది.. రాహుల్ గాంధీ ధ్వజం
Rahul Gandhi

ఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీ లిమిటేషన్ బిల్లుపై (Delimitation Bill) ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. 850 సీట్ల ప్రతిపాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 850 స్థానాలతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, అదానీ, అంబానీలు నేరపూరితమైన దొంగలని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని.. మోదీ ఓ ఫేక్ పీఎం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ ప్రతిపాదన వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు..

లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచాలనే ప్రతిపాదన వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు 850 సీట్లు అవసరం లేదని, ప్రస్తుత 543 స్థానాలతోనే అమలు చేయొచ్చని స్పష్టం చేశారు. 850 స్థానాల ప్రతిపాదన బీజేపీకి దేశ ఎన్నికల నియోజకవర్గాల పటాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. 850 సీట్ల సంఖ్య భారత ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రణాళికలో భాగమని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల మ్యాప్‌ను తిరిగి రూపొందించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహించారు.


భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు..

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారని దుయ్యబట్టారు. భారత ఎన్నికల రేఖాచిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో మోదీ అండ్ కో ఉన్నారని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు అక్రమం, మోదీ చట్ట విరుద్ధ నకిలీ ప్రధానమంత్రి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నియంతృత్వ పాలన వైపునకు తీసుకెళ్తున్నారని ఆగ్రహించారు. అధికార బీజేపీ కుట్రపూరిత ఆలోచనను యవత గ్రహించాలని కోరారు. దేశ భవిష్యత్తును ధ్వంసం చేయబోతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత లేని 14 కోట్ల మంది ఓటు వేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని.. ఆ ఎన్నికలు చట్టవిరుద్ధమని విమర్శించారు.


ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు..

జమ్మూకశ్మీర్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు, ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని వెల్లడించారు. హరియాణాలో బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో ఓటరు నమోదైన ఉదంతం ఓ ఉదాహరణ అని ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు ఉన్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనను బీజేపీకి అనుకూలంగా చేపట్టారని ఆరోపించారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఓటర్లను మార్చే అవకాశం ఉందని ఆరోపించారు. అస్సాంలోని కాజిరంగా, మంగళ్‌దోయ్ నియోజకవర్గాల ఆకృతులను ఉదాహరణగా చూపిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల సరిహద్దులను మార్చారని ధ్వజమెత్తారు.


కమిషన్ కూర్పుపై అభ్యంతరం..

ఇదే తరహాలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మ్యాప్‌ను మార్చేందుకు 850 సీట్ల ప్రతిపాదన ఉపయోగపడుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఒక్క ఓటు పడకముందే బీజేపీకి భారీ రాజకీయ ప్రయోజనం కల్పించేలా ఈ ప్రణాళిక ఉందని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియను పర్యవేక్షించే కమిషన్ కూర్పుపై అభ్యంతరం ఉందని అన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు డీలిమిటేషన్ కమిషన్‌లో కీలక పాత్ర కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కమిషన్‌లోని మూడో సభ్యుడిని కూడా జ్ఞానేశ్ కుమార్ ఎంపిక చేసే అవకాశం ఉందని ఆరోపించారు. డీలిమిటేషన్ కమిషన్‌పై మోదీ, అమిత్‌షాలకు పూర్తి నియంత్రణ లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 06:50 PM