Share News

ఇండియా కూటమిలో ట్విస్ట్.. టీవీకేతో పొత్తుకు స్టాలిన్ ససేమిరా

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:10 PM

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు మరింత బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపేందుకు డీఎంకే విముఖత చూపుతోంది.

ఇండియా కూటమిలో ట్విస్ట్.. టీవీకేతో పొత్తుకు స్టాలిన్ ససేమిరా
CM Vijay and Former CM Stalin

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఆ రాష్ట్రంలోని ఇండియా కూటమిలో విభేదాలు మరింత బయటపడుతున్నాయి. సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో చేతులు కలిపేందుకు ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) విముఖత చూపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం కూటమిలో భాగస్వాములుగా కొనసాగవచ్చని విడుతలై చిరుతైగల్ కట్చి(వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ సూచించారు. దీనికి కాంగ్రెస్ మద్దతు తెలుపగా.. డీఎంకే మాత్రం ససేమిరా అంటోంది.


ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొమ్మిదేళ్లుగా మాతో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు టీవీకేకు మద్దతిస్తోంది. ఇది వెన్నుపోటుతో సమానం. మంత్రి పదవుల కోసమే కాంగ్రెస్ డీఎంకేను వదిలేసింది. ఇప్పుడు వీసీకేను మధ్యవర్తిగా వాడుకుంటూ మళ్లీ డీఎంకేను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది' అని వ్యాఖ్యానించారు. కేరళ, బెంగాల్‌ తరహా రాజకీయాలు తమిళనాడులో పనికిరావని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం.. తమిళనాడులో టీవీకే మూడో ప్రధాన రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చిందని, దీంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు.


అంతేకాకుండా.. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపైనా చర్చించాల్సిన అవసరముందని రాజ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే.. బీజేపీ మాత్రం ప్రాంతీయ పార్టీల బలహీనతకే ప్రయత్నిస్తోందని, అందువల్ల సిద్ధాంతపరంగా బీజేపీయే డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక.. డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలు ఇంకా సద్దుమణగలేదని, ఇరు పార్టీల మధ్య సంబంధాలు బలపడేందుకు మరింత సమయం పడుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తమను వదులుకోవడం ద్వారా అది ఇండియా కూటమికే నష్టం చేకూరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.


ఇవీ చదవండి:

గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్

Updated Date - Jul 12 , 2026 | 04:15 PM