Share News

ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్

ABN , Publish Date - Jul 12 , 2026 | 10:56 AM

చిన్న గ్రామంలో మొదలైన ఓ యువకుడి కల.. నేడు కాలిఫోర్నియాలోని ప్రపంచ దిగ్గజ కంపెనీలో నిజమైంది. ఐఐటీ చదవకుండానే ప్రతిభ, పట్టుదలతో రూ.2.6 కోట్ల ప్యాకేజీతో జాబ్ సాధించిన ఆ యువకుడి ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.

ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్
Karnataka Engineer Bags Rs 2.6 Crore NVIDIA Job In California

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఐఐటీల్లో చదివితేనే పేరున్న టెక్ కంపెనీల్లో ఉద్యోగం సాధించవచ్చనే అభిప్రాయాన్ని చెరిపేశాడో యువకుడు. ఎలాంటి ఐఐటీ లేకుండానే.. కేవలం నైపుణ్యంతో కాలిఫోర్నియాలోని ఓ దిగ్గజ కంపెనీలో అదిరిపోయే ప్యాకేజీతో జాబ్ కొట్టేశాడు. స్వయంకృషి, నిరంతర సాధన, నైపుణ్యాలే విజయానికి అసలైన మార్గమని నిరూపించిన ఆ యువకుడి స్ఫూర్తిదాయక గాథను ఓసారి పరిశీలిస్తే...


కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్.. ఇటీవల కాలిఫోర్నియా(అమెరికా)లోని శాంటాక్లారాలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా(NVIDIA) హెడ్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ - డీప్ లెర్నింగ్ హోదాలో చేరాడు. అతడి వార్షిక వేతనం సుమారు 2.75 లక్షల డాలర్లు(సుమారు రూ.2.6 కోట్లు). మధ్య తరగతి కుటుంబానికి చెందిన పృథ్వీ.. ఐఐటీలో కాకుండా, బెంగళూరులోని పీఈఎస్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివాడు. అక్కడ నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తూ ఏఐ, డీప్ లెర్నింగ్ విభాగంలో సెల్ఫ్‌గా ఆన్‌లైన్ కోర్సులు, ప్రాజెక్ట్‌లు చేస్తూ నిరంతర సాధనతో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఆ తర్వాత యూఎస్‌లోని ఓ సాధారణ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఆర్థిక ఇబ్బందులు, సరైన గైడెన్స్ లేకపోవడం వంటి సవాళ్లెన్నో ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. తన సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటూ.. చివరకు ఎన్విడియా నిర్వహించిన క్లిష్టమైన సెలక్షన్ ప్రాసెస్‌లో సక్సెస్ అయి తానెంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.


ఈ సందర్భంగా పృథ్వీరాజ్ స్పందిస్తూ.. 'చిన్న పట్టణంలో నిశ్శబ్దంగా మొదలైన నా కల నేడు నిజమైంది. ఒకప్పుడు అందని ద్రాక్షలా కనిపించిన టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు పనిచేసే అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక సక్సెస్ గురించి మాట్లాడితే.. కాలేజీ పేరు కంటే స్కిల్‌పై దృష్టి సారించాలి. నిరంతరం నేర్చుకుంటూ, ఓర్పుతో ముందుకు సాగాలి' అని చెప్పాడు. విజయానికి అడ్డంకులు సహజమని, వాటిని అధిగమించే పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందంటాడు పృథ్వీ. ఈ యువకుడి విజయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


ఇవీ చదవండి:

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!

వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..

Updated Date - Jul 12 , 2026 | 11:00 AM