Share News

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:52 PM

ప్రేమను మాటల్లో కాకుండా ముద్దులతో ప్రపంచానికి చాటిందో జంట. కేవలం 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రేమకు గుర్తుగా చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!
Brazilian couple set adorable Guinness World Record

ఇంటర్నెట్ డెస్క్: ముద్దులు ప్రేమకు ప్రతీక. అదే ముద్దులతో ప్రపంచ రికార్డ్ సృష్టించింది బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రేమజంట. కేవలం అర నిమిషంలో 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తమ ప్రేమను గిన్నిస్ రికార్డుగా మలిచిన ఆ ప్రేమజంటే.. రెనాటో బేమా గయా(32), నయారా రొబర్టా రిబెయిరో(33). వృత్తి రీత్యా వైద్యులైన వీరు.. అంతర్జాతీయ కిస్సింగ్ డే సందర్భంగా ఈ ఫీట్ సాధించారు.


కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వైద్యులుగా కలిసి పనిచేసిన రెనాటో, నయారా.. సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రపంచంలో తమదే అత్యుత్తమ జంట అనే నమ్మకంతో రికార్డ్ నెలకొల్పాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఆ ప్రయత్నంలో రెనాటో.. నయారా చెంపపై ముద్దులు పెడుతుండగా ఆమె నవ్వుతూ ఆస్వాదించింది. అలా ఇద్దరూ 30 సెకన్ల వ్యవధిలో 195 ముద్దులను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.


అయితే.. ఇక్కడితో తమ ప్రయాణం ముగియలేదని, మరో కొత్త రికార్డుపై దృష్టి సారించినట్లు ఈ జంట వెల్లడించింది. జపాన్‌కు చెందిన జంట పేరిట ఉన్న ఒక్క నిమిషంలో 277 ముద్దులు రికార్డును అధిగమించడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. కాగా.. వ్యక్తిగతంగా ఇప్పటికే పలు విభాగాల్లో గిన్నిస్‌లో చోటు దక్కించుకున్న రెనాటో ఖాతాలో ఈ అరుదైన ఘనత దక్కడం విశేషం. గతంలో అత్యంత వేగంగా(6.68 సెకన్లలో) 10 పుస్తకాలను అమర్చి, పడగొట్టడం వంటి పలు రికార్డులు రెనాటో పేరిట ఉన్నాయి. తాజా ఘనతతో అత్యధిక గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన బ్రెజిల్ వాసిగా నిలిచినట్టు రెనాటో హర్షం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

అంతరిక్షం నుంచి అమెరికా స్వాతంత్య్ర వేడుకల వ్యూ.. నాసా వీడియో వైరల్

గేట్ కీపర్ సాహసానికి నెటిజన్ల సెల్యూట్.. షాకింగ్ ఘటన!

Updated Date - Jul 11 , 2026 | 07:06 PM