Share News

పరధ్యానంలో రైలు పట్టాలపై.. రెప్పపాటు కాలంలో రక్షించాడిలా..

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:04 PM

ఒక్కోసారి కొందరు పరధ్యానంలో ఉంటారు. ఏదో ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళుతుంటారు. ఆ సమయంలో జరగరాని ప్రమాదం రెప్పపాటులో జరిగిపోతుంది.

పరధ్యానంలో రైలు పట్టాలపై.. రెప్పపాటు కాలంలో రక్షించాడిలా..

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి కొందరు పరధ్యానంలో ఉంటారు. ఏదో ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళుతుంటారు. ఆ సమయంలో జరగరాని ప్రమాదం రెప్పపాటులో జరిగిపోతుంది. అదీ మన ప్రమేయం లేకుండానే. అయితే.. ఒక్కోసారి అదే సమయంలో ఎవరో ఒకరు ఆపద్భాంధవుడిలా వచ్చి రక్షిస్తుంటారు. అలాంటి ఘటనే ఇది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన తమిళనాడులోని సిర్కాళి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..


రైల్వే ట్రాక్‌పై రైలు దూసుకొస్తోంది. విధి నిర్వహణలో ఉన్న రైల్వే గేట్ కీపర్ గ్రీన్, రెడ్ జెండాలు పట్టుకుని ఉన్నాడు. ఇంతలో రైలు పట్టాలెక్కిన ఓ వ్యక్తిని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పక్కకు తోసేసి రెప్పపాటు కాలంలో ప్రాణపాయం నుంచి కాపాడాడు. ఆ తర్వాత వెంటనే ట్రాక్‌పై రైలు వేగంగా వెళ్లిపోయింది.


ఈ వీడియో చూస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను @gharkekalesh అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. కొందరు ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరికొందరు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 05:42 PM