మూగబోయిన మధుర గానం.. శాశ్వత నిద్రలోకి ఎస్.జానకి
ABN , Publish Date - Jul 11 , 2026 | 08:26 PM
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ గాయని, దక్షిణాది స్వరకోకిల ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన 60ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి చెరగని ముద్రవేశారు. ఆమె గాన ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.
1938 ఏప్రిల్ 23న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు జానకమ్మ. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారిగా స్టేజీపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో ఆమె అధికారికంగా ఎక్కడా శిక్షణ పొందలేదు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయట్టు' ద్వారా నేపథ్య గాయనిగా సినీ ప్రయాణం మొదలెట్టిన జానకి.. అదే ఏడాది 6 భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి, ఆ పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి అపూర్వమైన రికార్డు నెలకొల్పారు.
జానకి 1959లో వి.రామ్‌ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సంగీత రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 1997లో గుండెపోటుతో రామ్‌ప్రసాద్ కన్నుమూశారు. 2016లో సినిమా పాటలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు వీడ్కోలు పలికిన గానగాంధర్వి.. 2018లో తమిళ చిత్రం 'పన్నాడి' కోసం మరోసారి తన గాత్రాన్ని వినిపించి అభిమానులను అలరించారు. జానకి అసాధారణ ప్రతిభకు గానూ.. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 10 నంది పురస్కారాలు లభించాయి. కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా నుంచి ఒక అవార్డు అందుకున్న స్వర కోకిల.. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు.
ఎస్.జానకి పొందిన పలు అవార్డుల వివరాలిలా..
1986లో కలైమామణి అవార్డు
1997లో ఫిలింఫేర్, 2002లో అఛీవర్ అవార్డు
2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక అవార్డు
2009లో గౌరవ డాక్టరేట్
2011లో కర్ణాటక బసవ భూషణ్ అవార్డు
2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్ అవార్డు
2013లో పద్మ భూషణ్ అవార్డు (తిరస్కరణ)
2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు
2015లో సైమా లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు
2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం
జానకమ్మ మరణంతో భారత సినీ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయింది. తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమలు, సంగీత విద్వాంసులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
ఇవీ చదవండి:
వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు
తమిళనాడులో ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో కార్మికుల మృతి