హృదయవిదారకం.. నాలుగు గంటల పాటు ఇంటి పైకప్పుపై మృతదేహంతో..
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:42 PM
ఓ కుటుంబానికి జీవితంలో ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఒకవైపు కన్నుమూసిన ఆత్మీయురాలి మృతదేహం.. మరోవైపు ముంచుకొస్తున్న వరదనీరు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం నాలుగు గంటలపాటు ఇంటి పైకప్పుపైనే గడిపింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వానలకు ఎవరికీ రాకూడని కష్టం ఓ కుటుంబానికి వచ్చింది. కుటుంబ సభ్యురాలు మృతిచెందడంతో కడసారి వీడ్కోలు చెప్పాల్సిన వేళ వారికి కనీవినీ ఎరుగని సమస్య ఎదురైంది. ఒకవైపు కన్నుమూసిన ఆత్మీయురాలి మృతదేహం.. మరోవైపు ముంచుకొస్తున్న వరదనీరు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం నాలుగు గంటలపాటు ఇంటి పైకప్పుపైనే గడిపింది. ప్రాణాల కోసం పోరాడుతూనే కుటుంబ సభ్యురాలికి చివరి గౌరవం దక్కే రోజు కోసం ఇంటిపై ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దేవీపాడలో చోటుచేసుకుంది.
దేవీపాడకు చెందిన అనుస్య మనోహర్ లీలాక(55) జులై 6న కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే ఊహించని విపత్తు ఎదురైంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా వరద నీరు ఇంటి పరిసరాల్లోకి చేరింది. చూస్తుండగానే నీటి మట్టం మరింత పెరగడంతో ఇంట్లో ఉండటం ప్రమాదకరంగా మారింది. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు అనుస్య మృతదేహాన్ని తీసుకుని ఇంటి పైకప్పుపైకి ఎక్కారు. ఓ వైపు కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధ.. మరోవైపు వరద ప్రవాహం నుంచి బయటపడేందుకు తాపత్రయం. ఆ కుటుంబానికి దాదాపు నాలుగు గంటల పాటు నరకం కనిపించింది. మృతదేహాన్ని వదిలి వెళ్లలేక, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఆ కుటుంబం పడిన వేదన స్థానికులను కలచివేసింది.
చివరికి వరద ఉధృతి తగ్గే వరకు వారు ఇంటి పైకప్పుపైనే ఉన్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత అనుస్యకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై దేవీపాడ గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరదల సమయంలో అధికారులు స్పందించలేదని, బాధిత కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని వారు ఆరోపిస్తున్నారు. విపత్తు వేళ తమను ఆదుకునేందుకు అధికారులు రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబం ఎదుర్కొన్న ఈ విషాద ఘటన.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే చిన్నారి మృతి..
బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..