పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే చిన్నారి మృతి..
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:13 PM
కేరళంలోని కన్నూర్ జిల్లాలో పెదవికి గాయమైన 18 నెలల బాలుడు మృతిచెందడం కలకలం రేపింది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే ప్రాణాలు తీశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స సమయంలో ఇచ్చిన మత్తుమందు (అనస్థీషియా) కారణంగానే తమ కుమారుడి ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరువనంతపురం: కేరళంలోని కన్నూర్ జిల్లాలో పెదవికి గాయమైన 18 నెలల బాలుడు మృతిచెందడం కలకలం రేపింది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే ప్రాణాలు తీశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స సమయంలో ఇచ్చిన మత్తుమందు (అనస్థీషియా) కారణంగానే తమ కుమారుడి ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నూర్ జిల్లా ఎరమం-కుట్టూర్ ప్రాంతానికి చెందిన టి.సూరజ్, విజయ షా దంపతుల కుమారుడు దేవాన్ష్ శౌర్య జులై 5న ఇంటి బయట ఆడుకుంటూ కిందపడిపోయాడు. దీంతో బాలుడి పెదవికి గాయమైంది. రక్తం కారుతుండటంతో తల్లిదండ్రులిద్దరూ చిన్నారిని తొలుత మథమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పయ్యన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్సలో భాగంగా బాలుడి గాయానికి కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు మత్తుమందు ఇచ్చి కుట్లు వేశారు.
ఆ కాసేపటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వైద్యులు కన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బాలుడు మృతిచెందాడు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. వైద్యురాలు అంజలి పొడువల్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడంటూ ఆరోపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బీఎన్‌ఎస్ సెక్షన్ 125 కింద వైద్యురాలిపై కేసు నమోదు అయింది.
మరోవైపు వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడనే ఆరోపణలను బేబీ మెమోరియల్ ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. మత్తుమందు ఇచ్చిన వెంటనే చిన్నారికి ఊహించని విధంగా గుండెపోటు వచ్చిందని, వెంటనే వెంటిలేటర్‌పై ఉంచామని తెలిపింది. మెరుగైన చికిత్స కోసం కన్నూర్ శాఖకు తరలించినట్లు పేర్కొంది. అనస్థీషియా సరైన మోతాదులో ఇచ్చినా, అన్ని వైద్య ప్రమాణాలు పాటించినప్పటికీ కొన్నిసార్లు ఇలాంటి అరుదైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆస్పత్రి పేర్కొంది. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం అన్ని విధాలా ప్రయత్నించిందని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చాం: రాజ్‌నాథ్ సింగ్
అంతరిక్షం నుంచి అమెరికా స్వాతంత్య్ర వేడుకల వ్యూ.. నాసా వీడియో వైరల్