స్నేహం.. విశ్వాసం.. విలువలే భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: మోదీ
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:42 PM
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు ఆక్లాండ్‌లో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు స్నేహం, విశ్వాసం, విలువలు, బలమైన భవిష్యత్తు కోసం పరస్పర నిబద్ధతపై నిర్మితమయ్యాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మోదీ. న్యూజిలాండ్ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన 'వాకా(Waka)'ను గురించి ప్రస్తావిస్తూ.. 'అదో పడవ మాత్రమే కాదని, ఉమ్మడి ప్రయాణానికి చిహ్నం' అని పేర్కొన్నారు. భారత్-న్యూజిలాండ్ వాకా(బోటు) ఇప్పుడు నూతన ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రయాణం మున్ముందు మరింత విజయవంతమవుతుందనే పూర్తి నమ్మకం తనకుందన్న మోదీ.. అది తనవల్ల కాదని, అందుకు న్యూజిలాండ్‌లోని భారతీయులే కారణమన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రైస్ట్‌చర్చ్ నుంచి క్వీన్స్‌టౌన్ వరకు విస్తరించి ఉన్న భారతీయ సమాజమే ఈ స్వర్ణయుగ ప్రయాణానికి నిజమైన నావికులని కొనియాడారు. భారతీయుల ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించే అద్భుత దేశం న్యూజిలాండ్ అని అన్నారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓగా నిఖిల్ రవిశంకర్, గవర్నర్ జనరల్‌గా ఆనంద్ సత్యానంద్, క్రికెట్‌లో రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, అజాజ్ పటేల్ వంటి భారత సంతతి వ్యక్తులు రాణించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అలాగే ఆ దేశంలోని పలు ప్రాంతాలకు బాంబే హిల్స్, కోరమాండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్, అమృత్‌సర్ స్ట్రీట్ వంటి భారతీయ పేర్లుండటాన్ని ఇరు దేశాల మధ్య ఉన్న అనుబంధానికి సంకేతమని పేర్కొన్నారు.
ఆ దేశంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసిన మోదీ.. రాజకీయాల్లోకి రాకముందే న్యూజిలాండ్‌ను సందర్శించే అవకాశం వచ్చిందని చెప్పారు. నాడు ఓ న్యూజిలాండ్ వాసి తనకు మఫ్లర్, టోపీ, గ్లౌజులు కానుకగా ఇచ్చిన విషయాన్ని స్మరించుకున్నారు. ఆ మఫ్లర్‌ను ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపరుచుకున్నానని, అందులో న్యూజిలాండ్ దేశీయుల ప్రేమనూ అంతే ఆప్యాయంగా కాపాడుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సహా ప్రభుత్వ ప్రతినిధులు, లేబర్ పార్టీ నాయకులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-న్యూజిలాండ్ బంధాలకు అక్కడి అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
వియత్నాంలో ఘోర ప్రమాదం.. భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా!