పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:49 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, అనగా జులై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
ఢిల్లీ, జులై 12: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, అనగా జులై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే ప్రస్తావించే అవకాశం ఉంది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఈ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఈ సమావేశాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాల్లో చీలికలు.. బలపడుతున్న ఎన్డీయే కూటమి
ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు ప్రతిపక్ష పార్టీలలో వచ్చిన అంతర్గత మార్పులు, చీలికలు సభలో కొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. లోక్‌సభలో ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు 'నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా'లో విలీనమయ్యారు. వీరంతా లోక్‌సభలో తమకు ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే, ముగ్గురు రాజ్యసభ ఎంపీలూ తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అటు శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు అంతకుముందే బీజేపీ గూటికి చేరడం గమనార్హం.
సభను కుదిపేయనున్న కీలక అంశాలు
ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై సభలో రగడ జరిగే అవకాశం ఉంది.
1. NEET-UG పేపర్ లీక్ ఉదంతం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి.
2. ఆపరేషన్ సిందూర్, ప్రివిలేజ్ మోషన్: 'ఆపరేషన్ సిందూర్' ప్రాణనష్టానికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్(సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇచ్చింది.
130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఉత్కంఠ
ఈ సెషన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో కీలక అంశం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ.. వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో(జైల్లో) ఉంటే, సదరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేంద్ర/రాష్ట్ర మంత్రులు స్వయంచాలకంగా(Automatic) తమ పదవులను కోల్పోవాలనే నిబంధనను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
ఈ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) జులై 17న తన నివేదికను ఆమోదించి, పార్లమెంట్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఈ నిబంధనపై రాజకీయంగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.
ఇలాంటి భారీ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం, పదునైన అస్త్రాలతో ప్రతిపక్షాలు సిద్ధమవుతుండటంతో.. దాదాపు మూడు వారాలపాటు ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత వేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు