ఫిరంగి కోసం పోరాటం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:31 PM
యూనివర్సిటీల మధ్య సాధారణంగా క్రీడా పోటీలుంటాయి... లేదంటే డ్రామా పోటీలుంటాయి.
యూనివర్సిటీల మధ్య సాధారణంగా క్రీడా పోటీలుంటాయి... లేదంటే డ్రామా పోటీలుంటాయి. ర్యాంకులు సాధించడం లోనూ పోటీ పడటం సహజం. కానీ అమెరికాలోని రెండు యూనివర్సిటీల మధ్య ఒక ఫిరంగి కోసం ఏకంగా సుదీర్ఘ పోరాటమే జరిగింది. ‘ఆ ఫిరంగి మాదంటే మాది’ అంటూ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి?
అమెరికాలో ఉన్న ప్రిన్స్‌టన్, రట్జర్ యూనివర్సిటీలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాల్లో చదివారు. ఆశ్చర్యం ఏమిటంటే... ఈ రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒక ఫిరంగి వల్ల గొడవ ప్రారంభమైంది. ఆ ఫిరంగి అమెరికా స్వాతంత్య్ర యుద్ధంలో ఉపయోగించినది.
భూమిలో పాతిపెట్టారు...
నిజానికి ఫిరంగి ఒకటి కాదు, రెండు ఉండేవి. యుద్ధం ముగిసిన తరువాత వాటిని ప్రిన్స్‌టన్ క్యాంపస్‌లో ఉంచారు. 1812లో బ్రిటిష్ దాడులను ఎదుర్కొనేందుకు పెద్ద ఫిరంగిని తీసుకెళ్లారు. తరువాత ఆ ఫిరంగిని రట్జర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పెట్టారు. 24 ఏళ్ల తరువాత తిరిగి దానిని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి తీసుకొస్తున్న సమయంలో వాహనం పాడైంది. దాంతో ఫిరంగిని అక్కడే రోడ్డుపై పెట్టారు. రెండేళ్లపాటు దాన్నెవరూ పట్టించుకోలేదు.
ఆ తరువాత 1839లో లియోనార్డ్ జెరోమ్ అనే వ్యక్తి విద్యార్థులను సమీకరించి... వారి సహాయంతో ఫిరంగిని ప్రిన్స్‌టన్ తీసుకొచ్చి, యూనివర్సిటీ ప్రాంగణంలో భూమిలో పాతిపెట్టారు. అలా ఎందుకు పాతిపెట్టారో ఎవ్వరికీ తెలియదు. అయితే కొంతకాలం తరువాత ఫిరంగి తమదని రట్జర్ యూనివర్సిటీ విద్యార్థులు వాదించడం మొదలుపెట్టారు. 1875లో రట్జర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం ప్రిన్స్‌టన్‌కు చేరుకుని ఫిరంగిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే భూమిలో పాతిపెట్టి ఉండటంతో కదిలించలేకపోయారు. చేసేదేమి లేక అక్కడే ఉన్న చిన్న ఫిరంగిని పట్టుకెళ్లారు.
డాక్యుమెంటరీ...
రట్జర్ యూనివర్సిటీ విద్యార్థులు ఫిరంగిని పట్టుకెళ్లారనే విషయం అమెరికా అంతటా వ్యాపించింది. రెండు యూనివర్సిటీల అధికారులు లేఖలు రాసుకున్నారు. చివరకు ఒక కమిటీ వివాదాన్ని పరిష్కరించింది. చిన్న ఫిరంగిని తిరిగి ప్రిన్స్‌టన్ తీసుకొచ్చారు. అయితే అంతటితో గొడవ ఆగిపోలేదు. రట్జర్ విద్యార్థులు మరోసారి ఫిరంగిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఒక గొలుసును ఫిరంగికి కట్టి కారుతో లాగడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఫిరంగి కనిపించకుండా మట్టిపోశారు.
దాంతో ఎత్తుకెళ్లారని అందరూ భావించారు. కానీ తవ్వి చూస్తే ఫిరంగి బయటపడింది. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రిన్స్‌టన్ నుంచి ఫిరంగిని తీసుకెళ్లడం అసాధ్యమని భావించి... రాత్రివేళ వచ్చి ఫిరంగికి ఎరుపు రంగు వేశారు. విశేషం ఏమిటంటే... రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఘర్షణకు కారణమైన ఫిరంగిపై ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. ఉత్తమ విద్యార్థి చిత్రంగా అది అవార్డు గెలుచుకుంది. ఒక ఫిరంగి కోసం జరిగిన పోటీ... విశ్వవిద్యాల యాల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News