ఆషాఢ వేళ... మెహందీ కళ!
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:55 AM
ఆషాఢం వచ్చిందంటే... అతివల చేతులు గోరింటాకు డిజైన్లతో మెరిసిపోతాయి.
ఆషాఢం వచ్చిందంటే... అతివల చేతులు గోరింటాకు డిజైన్లతో మెరిసిపోతాయి. మెహందీ కోన్స్ వచ్చినతర్వాత తీరొక్క మెహందీ ఆర్ట్ మెలికలు తిరుగుతోంది. మినిమలిస్టిక్, ఫ్లోరల్, జామెట్రిక్, పర్సనలైజ్డ్... ఇలా మెహందీ మెరుపులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోన్న డిజైన్లు ఇవి...
మినిమలిస్టిక్ మెహందీ... ఈ తరహా డిజైన్లు సింపుల్‌గా ఉండానుకునేవాళ్లకు బాగా నచ్చుతాయి. గోరింటాకును చేతి నిండుగా నింపకుండా... ఖాళీ స్థలం ఉండేలా ఈ డిజైన్స్ వేయాల్సి ఉంటుంది. సింపుల్ డిజైన్లతో డీసెంట్‌గా కనిపిస్తుంది. రెగ్యులర్‌గా మెహందీ పెట్టుకొనేవాళ్లకిది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
లతలు... తీగలు...
మెహందీ డిజైన్స్‌ల్లో ఎక్కువ మంది వేయించుకునేవి కచ్చితంగా ఫ్లోరల్ అండ్ బొటానికల్ మోటిఫ్స్ అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో ప్రకృతి నుంచి ప్రేరణ పొంది... క్లిష్టమైన పూల నమూనాలను, ఆకులను ఓపికగా చేతి మీద అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గులాబీలు, తామరలు.. ఇలా ఒకటేమిటి అన్నిరకాల లతలు, తీగలకు చేతులపైనే గోరింటాకుతో జీవం పోయొచ్చు.

క్లిష్టంగా.. ఇష్టంగా..
లెక్కలంటే ఎవరికైనా కష్టంగా ఉంటాయి. వాటి నమూనాలు ఇప్పుడు మెహందీ డిజైన్లుగా చేతులపై చేరితే? ఇదిగో ఇలా జామెట్రిక్ డిజైన్స్‌గా మారుతాయి. త్రిభుజాలు, చతురస్రాలు... గణితంతో కూడిన క్లిష్టమైన ఆకృతులను చేతి నిండా నింపేయొచ్చు. రెగ్యులర్‌గా కాకుండా అందరిలో కాస్త ప్రత్యేకంగా, విలక్షణంగా కనిపించేందుకు ఈ డిజైన్లు ఎంచుకోండి. కాకపోతే వీటిని కోన్‌తో జాగ్రత్తగా వేయడానికి డిజైనర్లకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఓపిక చాలా అవసరం.
ఫ్యూజన్‌తో పర్‌ఫెక్ట్..
అరబిక్ డిజైన్లను ఎప్పటి నుంచో మెహందీ ఆర్టిస్టులు అనుసరిస్తున్నారు. ఇప్పుడు మొరాకో మూలాంశాలు, టర్కిష్ నమూనాలు, ఆఫ్రికన్ ప్రేరేపితాలను సైతం చేతుల మీద అందంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి సంస్కృతులను అందంగా అతివల చేతి మీద హైలైట్ చేస్తున్నారు. కొన్నిసార్లు సమకాలీన డిజైన్లు కూడా వీటిలో చేరిపోతున్నాయి. వీటిపట్ల యువతరం ఆసక్తి చూపుతోంది.

పూర్తిగా వ్యక్తిగతం..
మెహందీతో పర్సనలైజ్డ్ అంటే వ్యక్తిగత ఇష్టాలను కూడా డిజైన్ చేస్తున్నారు. అంటే నచ్చిన వ్యక్తి, పేరు, చిహ్నాలను ఇలాఎవరికి నచ్చిన అంశాన్ని వారు మెహందీ డిజైన్‌గా చూసుకోవచ్చు. మెహందీ ఒక కథనంగా కనిపించాలంటే... ఆర్టిస్ట్‌తో ఆలోచనలను పంచుకుంటే, దానికి అందమైన రూపాన్నిస్తారు. వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ డిజైన్లదే హవా. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా కోరుకొనే మెహందీ డిజైన్లలో ఇవే టాప్ లిస్ట్‌లో ఉంటున్నాయి.
ఈ జాగ్రత్తలు అవసరం
తడి చేతుల మీద ఎప్పుడూ మెహందీ వేయించుకోవద్దు. దానివల్ల సరిగా పండకపోవచ్చు.
కొందరు మెహందీ త్వరగా ఆరిపోవాలని ఎండలో కూర్చుంటారు. అది కూడా తప్పు. అలా చేయడం వల్ల మెహందీ ఎర్రగా పండదు.
కనీసం 4 నుంచి 6 గంటలపాటు మెహందీ చేతి మీద ఉంటేనే అనుకున్న ఫలితం వస్తుంది.
మెహందీ తీశాక కనీసం 10గంటల పాటు నీరు తగలకుండా చూస్తే, ఎక్కువ కాలం నిలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
హే రామ్.. హే రావణ్.. ఇంత విద్వేషమా?
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News