‘వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్...
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:18 AM
పెళ్లి భోజనాలనగానే లగ్జరీగా ఏర్పాట్లు చేస్తున్నారు క్యాటరింగ్‌వాళ్లు. ప్యాకేజ్‌ను బట్టి ఏర్పాట్లు ఉంటున్నాయి.
పెళ్లి భోజనాలనగానే లగ్జరీగా ఏర్పాట్లు చేస్తున్నారు క్యాటరింగ్‌వాళ్లు. ప్యాకేజ్‌ను బట్టి ఏర్పాట్లు ఉంటున్నాయి. ఒకవైపు ఛాట్, మరోవైపు ఫ్రూట్ కార్నర్, ఇంకోవైపు లైవ్ స్వీట్స్... అంతేనా... ఐస్‌క్రీమ్స్‌కు ఒక కౌంటర్, చైనీస్ రుచులకు ఒక కౌంటర్... చెప్పుకుంటూపోతే క్యూ పెరుగుతూపోతుంది. రుసుమును బట్టి మినరల్ వాటర్, బాటిల్డ్ వాటర్ సరేసరి. ఈ కోవలో ఇటీవల మెట్రో నగరాల్లోని లగ్జరీ పెళ్ళిళ్లలో సరికొత్తగా చేరింది ‘వాటర్ బార్’. దీనినే ‘హైడ్రేషన్ సెంటర్’ అని కూడా అంటున్నారు. అంటే రకరకాల ప్రీమియం నీళ్లు పెడుతున్నారు. ఆ విశేషాలే ఇవి...
ఈమధ్య హైదరాబాద్‌లోని ఓ భారతీయ ఫుడ్ స్టోర్‌లో ‘బ్లైండ్ టేస్టింగ్’ పోటీలు జరిగాయి. అంటే కళ్లకు గంతలు కడితే, రుచి చూసి ఏమిటో చెప్పే పోటీలన్నమాట. ఈ పోటీ వైన్‌కు సంబంధించినదో, కూల్‌డ్రింకులకు సంబంధించినదో కాదండోయ్... మంచినీళ్లకు సంబంధించినది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వత హిమపాతాల ‘ఏవియన్’, దక్షిణ ఫ్రాన్స్‌లోని వెర్గిజ్ నీటి ఊటల ‘పెర్రియర్’, ఇటలీలోని ఆల్ఫ్స్ పర్వత జలాల ‘శాన్ పెల్లెగ్రినో’, ఆరావళి పర్వత జలాల ‘ఆవా’ నీళ్ల శాంపుల్స్ రుచి చూస్తూ... వాటిలో ఉన్న ఖనిజాలు, కార్బొనేట్ లవణాల గురించి తెలియజేయడమే ఈ పరీక్ష.
ఒకప్పుడు ‘వైన్ సోమెలియర్’ (అంటే వైన్ రుచి చూసి చెప్పగల నిపుణులు), ఇప్పుడు కొత్తగా ‘నీళ్ల సోమెలియర్’లూ వచ్చేశారు. వీరి డ్యూటీ రకరకాల మంచినీళ్లని రుచి చూసి చెప్పడమే. తాగే నీళ్లు ఎక్కడైనా ఒకటే కదా అనిపించొచ్చు. కానీ అందులో ఎన్నో రుచులూ, ఫ్లేవర్లు ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టే నీటి ధర ఉంటుంది. అంటే మనం రోజూ తాగే నీళ్లు కాకుండా, అవన్నీ ప్రీమియం నీళ్లన్నమాట. వాటిని ఎంతమంది తాగుతారనే సందేహం అసలే వద్దు. ఎందుకంటే ఈ ప్రీమియం నీళ్ల బిజినెస్ మార్కెట్ విలువ ప్రస్తుతం 400 మిలియన్ డాలర్లు అంటే నమ్మగలరా?
నీటికీ రుచి ఉంటుంది...
నదిలో నీళ్ల రుచి ఒకలా ఉంటుంది. మంచినీటి సరస్సు నీటి రుచి మరోలా ఉంటుంది. ఇక వాన నీటి తీయదనం తెలిసిందే. ఇలా మనకు తెలిసే ఎన్నో రకాలున్నాయి. అయితే హిమపాతాల నీళ్లు, ప్రత్యేక జలాశయాలు, నదీగర్భంలోని నీళ్లు... మానవ తాకిడి లేని నీళ్లని పట్టుకొచ్చి... సరి కొత్తగా నీటి వ్యాపారం చేస్తున్నారు. అవే ప్రీమియం వాటర్‌గా రీబ్రాండింగ్ చెందుతున్నాయి. వీటి ధర ఒక్కో బాటిల్ వందల నుంచి లక్షల దాకా ఉంటోందంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడెప్పుడో విరాట్ కోహ్లి ‘ఏవియన్’ వాటర్ బాటిల్ నీళ్లు తాగుతూ కనిపించాడు. లీటర్ బాటిల్ నాలుగు వేల రూపాయలున్న నీళ్లు కోహ్లి తాగుతున్నాడని సోషల్ మీడియా అంతా కోడై కూసింది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాల్లోంచి తెచ్చిన నీళ్లవి. అయితే తాజాగా కొంతమంది శ్రీమంతులు ఇలాంటి అత్యంత స్వచ్ఛమైన నీటిని పెళ్లిళ్లల్లో ‘వాటర్ బార్’గా పెడుతూ వచ్చిన అతిథులను ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇవే ఎందుకు?
లగ్జరీ పెళ్లిళ్లల్లో... ‘ఓ గ్లాస్ నీళ్లు కావాలి’ అని అడగడం ఇప్పుడిప్పుడే మొదలైంది. పెళ్లంటేనే పసందైన భోజనాలు, పానీయాలు. ఒక్కోసారి మద్యపానం కూడా ఉంటుంది. కానీ నేడు వాటర్ బార్లు పెట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది. పెళ్లి వేడుకల్లో ఒకవైపు చాలా గ్రాండ్‌గా కనిపించే ఈ తరహా వాటర్‌బార్ల దగ్గరకు ఆసక్తిగా వెళ్లి, ఒక గ్లాస్ ప్రత్యేకమైన నీటిని తాగేందుకు అతిథులు ఉత్సాహం చూపుతున్నారు. వాటితో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. వాటర్ బార్లలో లభిస్తున్న రకరకాల నీళ్లని తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ నీటి వల్ల కలిగే లాభాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారు. ఖరీదైన మద్యం తాగినట్టే, ఖరీదైన నీళ్లు తాగడం ఇప్పుడు లగ్జరీగా భావిస్తున్నారు.
ఏ నీరైనా ఒకటే కదా అనుకుంటున్నారా?... ఓ చిన్న ఉదాహరణను చూద్దాం. మీ ముందు రెండు రకాల నీళ్లు ఉన్నాయి. ఒకటి హిమపాతాల నీళ్ల గ్లాసు, రెండోది ఇంట్లో ‘ఆర్వో ప్రాసెస్‌తో మినరల్స్‌ను తొలగించి శుద్ధి చేసిన నీళ్ల గ్లాసు.. పేరుకి ఇవి రెండూ నీళ్లే అయినా, ఈ రెండింటికీ సహజ వజ్రానికి, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రానికీ ఉన్నంత తేడా ఉంటుంది. మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ఖనిజాలు ఉంటే... ఆ నీళ్ల రుచి అమోఘం. కాస్త తియ్యగా అనిపించే ఈ నీళ్లని తాగితే కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. అదే సోడియం, బైకార్బొనేట్స్ ఉంటే కాస్త ఉప్పగా అనిపిస్తాయి. నీళ్ల వల్లే సగం వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిసిందే. అత్యంత పరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పైగా అవే నీళ్లు ఇప్పుడు లగ్జరీకి పర్యాయపదంగా మారాయి.
సెంటరాఫ్ అట్రాక్షన్...
యూరోపియన్ల భోజనాల్లో వాటర్ మెన్యూలు ఎప్పటి నుంచో భాగం అయ్యాయి. అదే ట్రెండ్ ఇతర దేశాలకీ పాకింది. ప్రస్తుతం పెళ్లిళ్లన్నీ అతిఽథులకు విభిన్న అనుభూతులను అందించేవిగా మారుతున్నాయి. ప్రీమియం మంచినీళ్లు అందులో భాగం. ఈ ‘వాటర్ బార్’లో ప్రపంచంలోని అన్ని రకాల మంచినీళ్లని అందిస్తారు. స్పార్క్‌లింగ్, నేచురల్ స్ర్పింగ్, గ్లేసియల్, ట్రాపికల్ ... ఇలా ఎన్నో. ఇలాంటి నీళ్లను అందించడం ద్వారా ఆ పెళ్లికే ఓ కొత్తదనాన్ని తీసుకువస్తున్నామని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్లను అందించడం మన భారతీయ సంప్రదాయంలో భాగమే కదా. కాకపోతే ఖరీదైన నీటిని అందిస్తూ, సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి వాటర్ బార్లు. కొత్త ఎప్పుడూ వింతే అన్నట్టుగా పెళ్లికి వచ్చిన అతిథులు ఈ బార్లలో రకరకాల రుచుల్లో ఉన్న స్వచ్ఛమైన, ఖరీదైన నీటిని గుటకేస్తూ మురిసిపోతున్నారు.
డిమాండ్ పెరుగుతోంది
మనకు ఇళ్లల్లోనే ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకుని మంచి నీళ్లు తాగడం అలవాటు. ఇప్పుడిప్పుడే మనదగ్గర ప్రీమియం నీళ్లకు డిమాండ్ పెరుగుతోంది. బాలీవుడ్ తార భూమి పెడ్నెకర్, తన చెల్లితో కలిసి ‘బాక్‌బే’ అనే మినరల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 750ఎంఎల్ నీళ్ల బాటిల్‌ను ఈ సంస్థ రెండు వందల రూపాయలకు విక్రయిస్తోంది. టాటాలు కూడా ప్రీమియం ‘హిమాలయన్’ మినరల్ వాటర్ ఫ్యాక్టరీని హిమాచల్ ప్రదేశ్‌లో స్థాపించారు. ’ఫుడ్‌స్టోరీస్’ కో ఫౌండర్ అవ్నీ బియానీ తమ షాపుల్లో ప్రీమియర్ నీళ్ల విక్రయాలు 2025లో మూడింతలు పెరిగాయని చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామాన్’తో ప్రసిద్ధిచెందిన జేసన్ మోమో కూడా ‘మునానులూ’ పేరిట మినరల్ నీళ్ల బ్రాండ్‌ను స్థాపించారు.
గుటకేయాల్సిందే...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 డ్రింకింగ్ వాటర్ బ్రాండ్లు ఇవీ...
ఆక్వా డి క్రిస్టెలో ట్రిబ్యుటో ఎ మొడిగ్లియాని: రూ. 50 లక్షల నుంచి 55 లక్షలు
కోనా నిగరి, జపాన్: రూ. 35 వేల నుంచి లక్ష కు పైనే ఉంటుంది
ఫిల్లికో జువెల్లరీ, జపాన్: రూ. 14 వేల నుంచి లక్ష దాకా ఉంటుంది
నేవాస్, జర్మనీ : రూ. 80 వేల నుంచి 97 వేలు
10 థౌంజెండ్ బీసి, కెనడా: రూ. 9000 - 97 వేలు
బ్లింగ్ హెచ్‌టూఓ, అమెరికా : రూ. 18 వేల నుంచి 25 వేలు.
స్వాల్‌బర్డి, నార్వే : రూ.15 వేలు.
వీన్, ఫిన్లాండ్: రూ. 2500 నుంచి 6,500
ఆర్ ఓ ఐ, మినరల్ వాటర్, స్లొవేనియా: రూ.3000 - 4000
ఆక్వాడెకో, కెనడా : రూ. 800 నుంచి 1200
ఈ వార్తలు కూడా చదవండి:
హే రామ్.. హే రావణ్.. ఇంత విద్వేషమా?
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News