Share News

హే రామ్‌.. హే రావణ్‌.. ఇంత విద్వేషమా?

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:44 AM

హే రామ్‌! హే రావణ్‌!... ఇంత విద్వేషాలు అవసరమా? కుల, మత, ప్రాంతాల వారీగా ఏమిటీ విష జ్వాలలు? తెలుగునాట, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎవరి కోసం? విద్వేషపూరిత...

హే రామ్‌.. హే రావణ్‌.. ఇంత విద్వేషమా?

హే రామ్‌! హే రావణ్‌!... ఇంత విద్వేషాలు అవసరమా? కుల, మత, ప్రాంతాల వారీగా ఏమిటీ విష జ్వాలలు? తెలుగునాట, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎవరి కోసం? విద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తున్నది ఎవరు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? సోషల్‌ మీడియాను ఇంతలా దుర్వినియోగం చేస్తున్నది ఎవరు? భూమి మీద ఉన్నవారు సరిపోలేదని పురాణాల్లోని పాత్రలను కూడా వివాదాల్లోకి లాగాల్సిన అవసరం ఎవరికొచ్చింది? వాల్మీకి విరచిత రామాయణంలోని శ్రీరాముడిని, రావణ బ్రహ్మను కూడా తుచ్చ రాజకీయాలకోసం ముడి సరుకుగా వాడుకోవడం ఏమిటి? హిందువులు దైవ స్వరూపుడిగా కొలిచే శ్రీరాముడిని కించపరిస్తే వచ్చేది ఏమిటి? ఆ క్రమంలో రావణ బ్రహ్మను కూడా వాడుకోవడం ఏమిటి? పురాణాలను వివాదాస్పదం చేయడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యాసుడు రచించిన మహాభారతంలోని సంఘటనలు, సన్నివేశాలను కూడా కించపరచడం ఏమిటి? ఈ పోకడలు అభ్యుదయ భావాలకు చిహ్నమా? హేతువాదానికి దీన్ని ప్రాతిపదికగా చెప్పుకోవచ్చా? ఎవరికోసమో ఇంకెవరో ఇంత సంకుచితంగా ఆలోచించడం, విద్వేషాలను ప్రచారం చేయడం ఆదర్శ భావాలకు ప్రతీక అవుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటినా తెలంగాణ వాదులమని చెప్పుకొనే కొందరికి ఆంధ్రా వారిపై అంత అక్కసు ఎందుకు? ఆంధ్రా వారికి తెలంగాణ వాదులపై కినుక ఇంకా అవసరమా? ఒకటి రెండు రాజకీయ పార్టీలకోసం ప్రజల మధ్య విభజన గీతలు గీస్తూ విద్వేషాలను ఎగదోయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు–వ్యక్తిగత దూషణలకు మధ్య తేడా ఉండదా? ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భాష–యాసలను కించపరచడం ఎలా అభ్యంతరకరమో హిందూ మత గ్రంథాలను అవమానించడం కూడా అంతే ఆక్షేపణీయం. ఈ పోకడల వల్ల ఒకటి రెండు రాజకీయ పార్టీలకు తాత్కాలిక ప్రయోజనం చేకూరవచ్చుగానీ దీర్ఘకాలంలో దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఆలోచించరా? అధికారంలోకి రావాలనుకుంటున్న వారికిగానీ, అధికారంలో ఉన్నవారికిగానీ ఈ ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత లేదా? సంక్షేమ పథకాల పేరిట అడ్డగోలుగా ఉచితాలను ప్రకటిస్తూ ప్రజలను సోమరిపోతులుగా చేయడమే కాకుండా రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన, చేస్తున్న రాజకీయ పార్టీలు... ఇప్పుడు మత ప్రాతిపదికన ప్రజలను చీల్చి ఏమి సాధించాలనుకుంటున్నాయి? కారణం ఏమైనా కొంతమంది యువతీ యువకులు రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారి సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో మరుగునపడుతున్న తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి ప్రయత్నం జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కుల మత ప్రాతిపదికన విభజన సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా చేసిన వీడియోలు, వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పోలీసులు అతడిని ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేశారు. దీంతో రావణ్‌ అనే వ్యక్తికి అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. మరోవైపు తమ మత గ్రంథాలను, దేవుళ్లను కించపరచడంపై హిందువులు మండిపడుతున్నారు.


ఎందుకీ వైపరీత్యం...

రాజకీయ ప్రయోజనాల వేటలో మత గ్రంథాల జోలికి వెళ్లడం ఎందుకో? రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడితే ప్రతి మత గ్రంథంలోనూ లోపాలు కనిపిస్తాయి. రామాయణంలోని రాముడిని హిందువులు దైవంగా పూజిస్తారు. అలాంటి శ్రీరాముడిని కించపరుస్తూ మాట్లాడటం వల్ల హిందువులు సహజంగానే బాధపడతారు. శ్రీరాముడి పాత్రలోని ఔన్నత్యాన్ని గుర్తించకుండా లోపాలను మాత్రమే ఎత్తిచూపడం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక మతం వారు మరో మతానికి చెందిన ఆరాధ్య దైవాలను కించపరుస్తూ పోతే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అర్థమవుతోందా? తండ్రి మాట జవదాటని, ఆడిన మాట తప్పని మహోన్నతుడిగా శ్రీరాముడిని వాల్మీకి ఆవిష్కరించారు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడిగా హిందువులు ఆరాధిస్తారు. శ్రీరాముడు అరణ్యవాసం చేసినా, సీత చేత అగ్నిప్రవేశం చేయించినా అందులో అద్భుత సందేశం ఉందని నమ్ముతారు. దీనివల్ల క్రైస్తవాన్ని స్వీకరించిన జోసెఫ్‌ అనే వ్యక్తికిగానీ, అతడిని సమర్థించే వారికిగానీ వచ్చే నష్టం ఏమిటో తెలియదు. శ్రీరాముడిని వెక్కిరిస్తున్నామని అనుకొని తమ పేర్లను రావణ్‌గా మార్చుకుంటున్న వారికి రామాయణంలోని రావణ బ్రహ్మ క్యారెక్టర్‌ ఔన్నత్యం గురించి ఏ మాత్రమూ తెలియదనుకోవాలి. రావణ బ్రహ్మ రాక్షసుడు కాదు! అణువణువునా శివ భక్తిని నింపుకొన్నవాడు. శూర్పణఖ ముక్కూ చెవులూ కోశారన్న కోపంతో సీతను అపహరించడమే రావణ బ్రహ్మ చేసిన అపరాధం. అపహరించిన సాధ్వి సీత చిటికెన వేలు కూడా అతను ముట్టుకోలేదు. అవకాశం ఉండి కూడా ఆమెను తాకలేదు. త్రేతాయుగ ధర్మం ప్రకారం పరస్ర్తీని అపహరించడం, వాంఛించడం మహాపాపం అని చెప్పడం కోసమే వాల్మీకి ఆ సన్నివేశాన్ని సృష్టించి ఉంటారు. తన చావుకు తనతోనే ముహూర్తం పెట్టిస్తున్నారని తెలిసి కూడా ముహూర్తం పెట్టుకున్న మహోన్నత పాత్ర‌ రావణ బ్రహ్మది. పురాణాల్లోని సంఘటనలు, సన్నివేశాల్లోని పరమార్థం తెలుసుకోకుండా వెకిలి వ్యాఖ్యలు చేయడం... అలా చేస్తున్న వారి అల్పత్వానికి నిదర్శనం అవుతుందే తప్ప పౌరాణిక పాత్రల ఔన్నత్యం ఏ మాత్రం తగ్గదు. మహాభారతాన్నే తీసుకుందాం. మనుషుల్లోని బలాలు బలహీనతలన్నీ మహా భారతంలోని పాత్రలలో కనిపిస్తాయి. సర్వకాల సర్వావస్థలకూ వర్తించే మహాభారతాన్ని మించిన గ్రంథం మరొకటి ఉంటుందా? వ్యాసుడిని మించిన రచయిత మరొకరు కనిపిస్తారా? అని ప్రశ్నించుకోవాలి. ఆయా సన్నివేశాల్లోని పరమార్థాన్ని గ్రహించకుండా అదేమిటీ ఇదేమిటీ అని రంధ్రాన్వేషణకు పూనుకోవడం మన అల్పత్వానికి నిదర్శనం. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న అనేక క్యారెక్టర్లు మహాభారతంలో కనిపిస్తాయి. అంతేకాదు, అన్ని వేల పాత్రలకు పేర్లు పెట్టడం సామాన్య విషయం కాదు కదా? మన పిల్లలకు పేర్లు పెట్టడానికి రోజుల తరబడి బుర్రకు పదునుపెడుతూ పుస్తకాలు తిరగేస్తున్న మనకు వ్యాసుడి గొప్పతనం తెలియకపోతే ఎలా? మానవ జాతి పరిణామంలో అనేక జాతులు, మతాలు పుట్టాయి. అందులో కొన్ని అంతరించాయి.


ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఈ ఆధునిక యుగంలో కూడా రాతి యుగం నాటి మూర్ఖత్వం ప్రదర్శించడం ఏమిటి? రెండు వేల సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం లేదు కదా! క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనమే విభజించుకున్నాం కదా! మనుషులు తమ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని మత గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే పాప పుణ్యాలు అని పేర్కొన్నారు. జీసస్‌ను శిలువ వేసి చంపిన మనుషులే ఆయనను దేవుడిగా మార్చుకున్నారు. సోక్రటీస్‌కు విషం ఇచ్చి చంపినవారే ఆ తర్వాత ఆయనను మహా తత్వవేత్తగా గుర్తించి గౌరవించారు. పాపం చేయడం, ఆ తర్వాత పాప పరిహారం చేసుకోవడం మనుషులకు అలవాటే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం!

కుట్రలు.. సూత్రధారులు!

జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ అనే వ్యక్తి హిందువుల మనోభావాలను గాయపరచడం వల్ల ఏం సాధించాడు? ఉపా చట్టం కింద అరెస్టు చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొందరపాటుతో అతడిని నాలుగు పర్యాయాలు బలహీనమైన కేసులలో ఎందుకు అరెస్టు చేయవలసి వచ్చింది? ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన క్యారెక్టర్లు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? మత విద్వేషాలు రగిలించి చలి కాచుకోవాలనుకున్న రాజకీయ పార్టీలు ఏవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారం కోల్పోయాక రాజకీయాలలో విద్వేషాలను చొప్పించడం మొదలైంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్నంత కాలం ఆంధ్రా– తెలంగాణ అన్న భేద భావం ప్రజల్లో కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రా, తెలంగాణ అనే విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇళ్లకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశిస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన నాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులను పిలిపించుకుని కర్తవ్య బోధ చేశారు. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ పంచన చేరిన కవులు, కళాకారుల్లో కొందరు ఉరకటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ‘ఇడుపు కాయితం’ పేరుతో సినిమా ప్రారంభం అవడం... ఇడుపు కాయితం అంటే అర్థం ఏమిటి? అని ఆంధ్రావాళ్లు ఎవరో వ్యంగ్యంగా ప్రశ్నించడం! వెరసి తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి కేసీఆర్‌ అండ్‌ కోకు ఒక ప్రాతిపదిక లభించింది. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణను కూడా ఇందుకోసం వాడుకున్నారు. తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక ప్రశ్న.


కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడే తెలంగాణ సెంటిమెంటు తెర మీదకు ఎందుకొస్తోంది? ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమయ్యే పక్షంలో తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసి, హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా కావాలి అని ఈసడించుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించినా, ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించినా కేసీఆర్‌ కోసం మాత్రమే స్పందించే తెలంగాణ వాదులు ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన నష్టమేమిటి? రాజశేఖరరెడ్డి చేసిన మేళ్లేమిటి? కేవలం కేసీఆర్‌ రాజకీయ ప్రయోజనాల చుట్టూ మాత్రమే తెలంగాణ సెంటిమెంటు తిరుగుతూ ఉంటుందా? రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందుచేత కేసీఆర్‌కు ఆయన వల్ల రాజకీయంగా నష్టం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే అది కేసీఆర్‌కు నష్టం కనుక ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారన్నది నిజం కాదా? దీన్నిబట్టి కేసీఆర్‌ కోసమే తెలంగాణ సెంటిమెంటు సజీవంగా ఉంటుందని భావించడంలో తప్పేమిటి? ఇది నిజం కాదని ఆయన కోసం వివిధ రూపాలలో పనిచేస్తున్న వారు చెప్పగలరా? ఒక వ్యక్తికి అధికారం కట్టబెట్టడం కోసం రెండు రాష్ర్టాల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం అవసరమా? కేసీఆర్‌ అధికారంలోకి రావాలనుకొనే వాళ్లు... ఆయన అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్పుకోవాలిగానీ ఆంధ్రా వాళ్లను బూచిగా చూపడం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్‌ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ర్టాలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలకు భారత రాష్ట్ర సమితి, వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్‌ మీడియా సైనికులు ఊతమిస్తున్నారు. ఈ రెండు పార్టీలకూ అనుబంధంగా పనిచేస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సెంటిమెంటును, ఆంధ్రప్రదేశ్‌లో కుల మత విద్వేషాలను ఏక కాలంలో రగిలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రధానంగా టార్గెట్‌ చేసుకోవడం వెనుక జగన్‌రెడ్డి వ్యూహం దాగి ఉంది. జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ వంటి వారికి పవన్‌ కల్యాణ్‌తో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయినా వారంతా పవన్‌ కల్యాణ్‌ మీదే ఎందుకు పడుతున్నారు? అంటే, కారణం లేకపోలేదు. పవన్‌ కల్యాణ్‌ నుంచి కాపులను విడదీయడం సాధ్యపడకపోతే... కనీసం కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న పరమార్థం. పవన్‌ కల్యాణ్‌ను తిడితే కాపు యువత సహజంగానే ఆవేశపడుతుంది. జగన్‌రెడ్డికి కావలసింది అదే. సోషల్‌ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు రగలకపోతుందా అన్నది జగన్‌ అండ్‌ కో ఆశ. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బలహీనత కులం–మతం అని గుర్తించిన జగన్‌రెడ్డి ఆ రెండింటినీ వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమకోసం పనిచేసే వారి ద్వారా పురాణాల్లోని పాత్రలను కించపరిచేలా చేసి వివాదాలు సృష్టిస్తున్నారు. ఫలితంగా మత విద్వేషాలు రగలడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అదే. పనిలో పనిగా దేశ భక్తి, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ అనే ఒక చిన్న ప్రాణి చుట్టూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తిరగడమే వర్తమాన రాజకీయాల్లో మహా విషాదం.


కూడుపెట్టని కులం కోసం...

జన సైనికుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కావొచ్చు లేదా మరో కారణం వల్ల ఏమో తెలియదుగానీ రావణ్‌ను అరెస్టు చేసే విషయంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. ఉపా చట్టం కింద రావణ్‌ను అరెస్టు చేయడానికి ఇప్పుడు చూపుతున్న ఆధారాలనే ప్రారంభంలో చూపించి అరెస్టు చేసి ఉంటే అతనికి బెయిల్‌ వచ్చేది కాదు. ప్రభుత్వం తొందరపడిందన్న అపవాదూ వచ్చేది కాదు. రావణ్‌ వంటి వారి వెనుక జగన్‌ అండ్‌ కో ఉన్నారా లేదా అన్న విషయమై ప్రజలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ క్రైస్తవులు జగన్మోహన్‌రెడ్డికి అండగా ఉంటున్నారు. ఇప్పుడు హిందువుల మనోభావాలను కించపరచడం ద్వారా జగన్‌రెడ్డికి కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. రావణ్‌వంటి వారి వల్ల హిందువులు సంఘటితమైతే అది కూటమికే లబ్ధి చేకూర్చవచ్చు. బహుశా ఈ కారణంగానే కాబోలు హిందువులు సంఘటితం కాకుండా కులాల మధ్య విభజనకు జగన్‌ అండ్‌ కో ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కులం కూడు పెట్టదు– మతం జీవితాలను మార్చదు అని తెలిసి కూడా వాటికోసం మానవ జాతి కొట్టుకోవడం అనాదిగా వస్తున్నదే! నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వం మంచి ఫలితాలు చూపిస్తోంది. అయితే కుల మతాల రొంపి కారణంగా ఆ విజయాలు మరుగున పడిపోతున్నాయి. తమిళనాడు నుంచి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావడం, మంత్రి లోకేశ్‌ పనితీరును ఆ రాష్ర్టానికి చెందిన ఆర్థికవేత్త ఒకరు ప్రశంసించడం ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి తెలుసు? వాహనాలపై కులం పేరు వాడటాన్ని నిషేధిస్తూ బిహార్‌ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాంటి చర్యలు ఇక్కడ కూడా తీసుకోవాలి. చివరిగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ఒక చిన్న సూచన. కీలెరిగి వాత పెట్టాలని పెద్దలు ఎందుకు చెప్పారో ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుందని కూడా అదే పెద్దలు చెప్పారు. పెద్దల మాట చద్ది మూట!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 12:44 AM