Share News

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

ABN , Publish Date - Jul 12 , 2026 | 09:36 AM

భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. జింబాబ్వేతో జులై 23 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు అతడు భారత జట్టులో కొనసాగుతున్నప్పటికీ.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20కి అతడిని తప్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. మ్యాచ్‌కు ముందు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో వైభవ్ తీవ్ర నిరాశకు గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైభవ్‌ను తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ముందుగానే చెప్పాల్సింది: అంబటి రాయుడు

‘వైభవ్ రియాక్షన్ చూస్తే.. అతడు ఆడడం లేదని ముందు రోజే చెప్పినట్లు అనిపించడం లేదు. సంజు శాంసన్‌ను ఆడించాలని మ్యాచ్ రోజునే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. యువ ఆటగాళ్లపై వచ్చే ఒత్తిడిని జట్టు యాజమాన్యమే భరించి వారిని సానుకూల వాతావరణంలో ఉంచాలి. కానీ ఇక్కడ అలా జరగలేదనిపిస్తోంది. భారత క్రికెట్‌కు మరో 20-25 సంవత్సరాలు సేవ చేయగల ఆటగాడిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. వైభవ్ లాంటి అసాధారణ ప్రతిభను మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం చేయకూడదు. అతడిని ఇంకాస్త ఎక్కువ సంరక్షించాల్సిన అవసరం ఉంది’ అని అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.


వైభవ్‌ను ఆడించాల్సింది: సునీల్ గావస్కర్

‘శాంసన్‌ను ఆడించడంపై నాకు అభ్యంతరం లేదు. కానీ వైభవ్‌ను మూడో స్థానంలో ఆడించాల్సింది. అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచిన తీరు చూస్తే ఎంత నిరాశలో ఉన్నాడో అర్థమవుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హుక్ షాట్ ఆడి ఔటయ్యాడు. ఆ తప్పు నుంచి ఏమైనా నేర్చుకున్నాడేమో అని తెలుసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాల్సింది. జట్టులో లేకపోవడం 15 ఏళ్ల కుర్రాడికి చాలా బాధాకరం. మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన రెండు సిక్సర్లు బాదాడు. అవి అదృష్టవశాత్తూ వచ్చిన షాట్లు కావు. బంతిని అద్భుతంగా టైమ్ చేశాడు. అతడిలో అపారమైన సామర్థ్యం ఉంది. సిరీస్‌ను సమం చేయాల్సిన కీలక మ్యాచ్ అయితే అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది అలాంటి మ్యాచ్ కాదు. అందుకే వైభవ్‌కు మరో అవకాశం ఇవ్వాల్సిందని నా అభిప్రాయం. ఇప్పుడు అయినా ఏదైనా సీనియర్ ఆటగాడు అతడి భుజంపై చేయి వేసి.. 'ఇదే అంతం కాదు.. ఇంకా అవకాశాలు వస్తాయి' అని ధైర్యం చెప్పాలి’ అని గావస్కర్ సూచించాడు.


ఇవీ చదవండి:

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

Updated Date - Jul 12 , 2026 | 09:40 AM