గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టండి!
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:05 AM
సోషల్ మీడియాను దుష్ప్రచారానికి.. విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించే గొడ్డలి పార్టీ కుట్రలను టీడీపీ సహా కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని..
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాను దుష్ప్రచారానికి.. విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించే గొడ్డలి పార్టీ కుట్రలను టీడీపీ సహా కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని నేతలు సీఎంకి వివరించారు. దేశాన్ని, హిందూ మతాన్ని కించపరిచారని, మహిళలను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బచ్చలకూరి జోస్‌ఫ(రావణ్) అనే యూట్యూబర్‌కు ఆ పార్టీ అండగా నిలిచిందనే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం.. గొడ్డలి పార్టీ చేసే దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలను వివరిస్తే గొడ్డలి పార్టీ నేతల నోళ్లకు తాళాలు పడతాయన్నారు. వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అదేస్థాయిలో వ్యవహరించాల్సిన అవసరం లేదని, తప్పుడు ఆరోపణలను ఆధారాలతో సహా ఖండించి వాస్తవాలను ప్రజల ముందుంచితే చాలని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. ‘ఇరిగేషన్ క్యాలెండర్’ అమలు, యూరియా సరఫరా కోసం ప్రత్యేక యాప్, అన్నదాత సుఖీభవ నిధుల జమ, తల్లికి వందనం నిధుల విడుదల వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు అనే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు.