ఉల్లిగడ్డలకో ద్వీపం!
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:29 AM
అవాజీ ద్వీపం... జపాన్‌లోని కన్సాయి ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ద్వీపం. దానినే ‘ఆనియన్ ఐల్యాండ్’ అని పిలుస్తారు.
అవాజీ ద్వీపం... జపాన్‌లోని కన్సాయి ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ద్వీపం. దానినే ‘ఆనియన్ ఐల్యాండ్’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే అదొక ఉల్లిగడ్డల ద్వీపం. అక్కడికెళితే... ఉల్లిపాయలతో వేడి వేడి సూప్‌లే కాదు.. చల్లచల్లని ఐస్‌క్రీమ్‌లూ దొరుకుతాయి.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా... దీనినే జపాన్‌వాళ్లు పాటిస్తున్నారు. అందుకే ఒక ద్వీపాన్నే ‘ఆనియన్ ఐల్యాండ్’ అని ముద్దుగా పిలు చుకుంటున్నారు. ఈ ద్వీపం ఉల్లిపాయల ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ‘ఉల్లిపాయ లేకపోతే జీవితమే లేదు... అన్ని కాలాల్లోనూ అత్యంత శ్రేష్టమైనద’ని అక్కడివాళ్ల గట్టి నమ్మకం. అందుకే దీవినిండా ఎక్కడ చూసినా రాశులుగా పోసిన ఉల్లిపాయలు కనిపిస్తుంటాయి.
సాగుకు అనుకూలం...
జపాన్‌లోని ఒసాకా, కోబే నగరాల నుంచి కేవలం ఒక గంట ప్రయాణం చేస్తే ఈ ద్వీపానికి వెళ్లొచ్చు. ఇక్కడ మొట్ట మొదటి ఉల్లిపాయను 1888లో నాటినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మొదట్లో ఉల్లిపాయలను వంటల కోసం కాకుండా... అలంకరణ కోసం వాడేవారట. ఒకసారి జపాన్‌లో కలరా వ్యాప్తి చెందడంతో... అలాంటి విపత్కర సమయంలో కలరాను నయం చేయాలంటే ఉల్ల్లిపాయ ఉండాల్సిందేననే ప్రచారం జరిగింది. అప్పుడు ఉల్లిపాయలకు ఆదరణ పెరిగింది. పైగా అవాజీ ద్వీపంలో నేల... ఉల్లిపాయల సాగుకు అత్యంత అనుకూలంగా ఉండడంతో సహజంగానే సాగు పెరిగింది.
ఐస్‌క్రీమ్, బర్గర్లు...
‘ఒట్టామానెగి’ అనే భారీ ఉల్లిపాయ ఇక్కడ ప్రధానంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటుంది. ఈ ఉల్లిపాయ నమూనాని 2.5 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వ్యాసంతో రూపొందించారు. ఇక్కడ నుంచి సూర్యాస్తమయం చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. ‘ఆనియన్ ఐల్యాండ్’లో కొన్నిచోట్ల కేవలం ఉల్లిపాయను కాల్చి ఇస్తుంటారు. అలాగే తియ్యని ఉల్లిపాయలతో సంప్రదాయ టెంపురా సూప్‌ల నుంచి... ఉల్లిపాయ రుచిగల ఐస్‌క్రీమ్, బర్గర్‌లు కూడా ఇక్కడ లభిస్తాయి. యానిమీ థీమ్‌పార్క్ ఈ ఐల్యాండ్‌లో మరొక ఆకర్షణ. ఇక్కడ చాలా దుకాణాల్లో... వివిధ రకాల ఉల్లిపాయ ఉత్పత్తులను అమ్ముతుంటారు. ఉల్లిపాయ స్నాక్స్ నుంచి బ్యాండ్ ఎయిడ్స్ వరకు చూడొచ్చు. కీచైన్‌ల నుంచి టోట్‌బ్యాగ్‌లు కూడా ఉల్లిగడ్డ ఆకారంలో ఉంటాయి. ప్రత్యేకంగా ఆనియన్ క్లా మెషీన్‌లు మంచి టైంపాస్. ఇక్కడ కనిపించే ఆనియన్ విగ్‌లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయంటే అతిశయోక్తి కాదు!
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News