భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:01 AM
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం తర్వాత భారత జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ తర్వాత తాజాగా ఇంగ్లండ్‌పై వైట్ వాష్ అయింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, నాలుగింట్లో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా టాప్‌లో కొనసాగిన టీమిండియా.. ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
ఈ ఒక్క మార్పుతోనే కోచింగ్ బృందంలో పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో సహాయక కోచ్ కూడా త్వరలోనే తప్పుకునే అవకాశాలున్నాయని సమాచారం. గౌతమ్ గంభీర్‌తో కలిసి అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్, మోర్నే మోర్కెల్ 2024 జులైలో భారత జట్టు కోచింగ్ సిబ్బందిగా బాధ్యతలు చేపట్టారు. ఫీల్డింగ్ కోచ్‌గా టీ. దిలీప్ కొనసాగుతున్నారు. కాగా, అభిషేక్ నాయర్ 2025లో జట్టును వీడారు. సమాచారం ప్రకారం.. నిష్క్రమణకు సిద్ధమైన కోచింగ్ స్టాఫ్ సభ్యుడు బీసీసీఐతో 2+1 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో గ్లోబల్ ఉనికి కలిగిన ఓ ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయానికి ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టీమిండియా వరుసగా టీ20 మ్యాచ్‌లు ఓడిపోవడమే కారణమా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టత లేదు. తాజా వైఫల్యాలతో సంబంధం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గంభీర్, ర్యాన్ టెన్, మోర్కెల్ నేతృత్వంలోని కోచింగ్ బృందం పర్యవేక్షణలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో వరుస సిరీస్ పరాజయాలు జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలకు దారితీశాయి. మరో ఏడాదిలోనే 2027 వన్డే ప్రపంచకప్ ఉండటంతో కోచింగ్ విభాగంలో జరిగే మార్పులపై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..
వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం