అఖాడాల అడ్డా
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:58 AM
ఈతరం సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌ల చుట్టూ తిరుగుతోంది. కానీ ఒకప్పుడు వ్యాయామం అంటే అఖాడాలే.
ఈతరం సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌ల చుట్టూ తిరుగుతోంది. కానీ ఒకప్పుడు వ్యాయామం అంటే అఖాడాలే. యువకులు అఖాడాల్లో బరువులు ఎత్తుతూ, మట్టిలో కుస్తీ పడుతూ సత్తా చాటుకునేవారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అఖాడాల సంస్కృతి ఆశ్చర్యంగా ఇప్పటికీ కొనసాగుతోంది. అది కూడా ఆధ్యాత్మిక కేంద్రం వారణాసిలో. ఈ అఖాడాల అడ్డాపైనే ఈవారం కవర్‌స్టోరీ.
వారణాసి... కాశీ.... బనారస్... పేరేదైనా అదొక ఆధ్యాత్మిక చిరునామా. ఆ పేరు తలుచుకోగానే... సాయం వేళల్లో గంగానదికి హారతిచ్చే అద్భుతదృశ్యం కళ్లముందు కదలాడుతుంది. అయితే కాశీలో చాలామందికి తెలియని విశేషం ఏమిటంటే... అదొక అఖాడాల అడ్డా. కొన్ని వందల ఏళ్లుగా అక్కడ యువతకు కుస్తీ నేర్పిస్తున్న అఖాడాల గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
వారణాసిలో అత్యంత పురాతనమైన అఖాడాను కవి, రచయిత తులసీదాస్ 16వ శతాబ్దంలో స్థాపించారు. తులసీదాస్ రోజూ అఖాడాలో వ్యాయామం చేస్తూ, యువతలో ఉత్సాహం, స్ఫూర్తి నింపేవారట. వారణాసిలో ఎంతోమంది పహిల్వాన్లను తయారుచేసిన ఘనత అక్కడి ‘తులసీ అఖాడా’కు ఉంది. ఈ అఖాడాకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. వారణాసితో పాటు మధుర, ఆగ్రా నగరాల్లోనూ కుస్తీకి గుర్తింపు ఉంది. రామాయణ, మహాభారత గ్రంథాలలో ఉన్న మల్లయుద్ధం ప్రేరణతో కుస్తీ రూపొందిందని చరిత్రకారులు చెబుతారు.
అఖాడా అంటే...
అఖాడా అంటే భారతీయ సంప్రదాయ వ్యాయామశాల. శారీరక వ్యాయామం కోసం యువత ఇక్కడ గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తారు. అయితే ఇవి ఆధునిక వ్యాయామశాలల్లా ఉండవు. వ్యాయామం కోసం ఉపయోగించే పరికరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆరుబయట మట్టితో ఏర్పాటు చేసిన ప్రదేశంలో కుస్తీ పడుతూ శారీరక ఆరోగ్యాన్ని పెంచుకుంటారు. పూర్వం యోధులు, సాధువులు, యువకులు వారి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, యుద్ధ విద్యలను అభ్యసించడానికి అఖాడాలను ఆశ్రయించేవారు. కాలక్రమేణా ఇవి కుస్తీ శిక్షణ కేంద్రాలుగా మార్పు చెందాయి.
మొఘలుల కాలంతో పాటు... ఆ తరువాత రాజుల కాలంలో అఖాడాలు సంస్కృతి, సంప్రదాయాల రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అఖాడాలలో సంప్రదాయ భారతీయ వ్యాయామ పద్ధతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గుంజీలు తీయడం, గదలతో సాధన చేయడం, తాడు ఎక్కడం, కుస్తీ పట్టడం వంటి వ్యాయామాలు చేయిస్తారు. ఇవి శరీరాన్ని బలంగా, చురుకుగా తయారు చేస్తాయి. కుస్తీ శిక్షణలో శక్తి, సహనం, వేగం, సమతుల్యత, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. అఖాడాలలో కుస్తీ నైపుణ్యాలు మాత్రమే కాకుండా, వినయం, ఆత్మనియంత్రణ, కష్టపడి పనిచేసేతత్వం, ప్రత్యర్థి పట్ల గౌరవంగా మసలుకోవడం నేర్పిస్తారు. లంగోటి కట్టుకుని బరిలోకి దిగడం, మట్టిలో కలబడటం, ప్రత్యర్థిని కిందపడేసేందుకు శతవిధాలా ప్రయత్నించడం... ఇవన్నీ కుస్తీలో కనిపించే సాధారణ దృశ్యాలు. అయితే ఇక్కడ హింసకు చోటుండదు. అందుకే చూసేవారికి కూడా ఉత్సాహంగా ఉంటుంది.
కఠిన నియమాలు... శిక్షణ...
మల్లయోధునిగా మారడం అంత సులభమేమీ కాదు. కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహార నియమావళి ఉంటుంది. ఒక కుస్తీ యోధుని దినచర్య రోజూ ఉదయం నాలుగు గంటలకే వ్యాయామంతో ప్రారంభమవుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం కోసం తైలాలతో మర్దన, ప్రోటీన్ అధికంగా లభించే ఆహారం, బాదం పాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వ్యాయామశాలల్లో వెళ్లగానే కసరత్తులు ప్రారంభిస్తారు. కానీ అఖాడాలో అలా కాదు. శిక్షణ పొందేవారు అఖాడాల పట్ల చాలా గౌరవభావంతో ఉంటారు. ఒక రైతు విత్తనాలు నాటకముందు పొలాన్ని ఎలా సిద్ధం చేస్తాడో... అలా కుస్తీకి దిగే ముందు నేలను మెత్తగా చేస్తారు. అఖాడాలో ఒక చోట కుస్తీ నేర్చుకునేందుకు మృదువైన ఎర్రటి మట్టితో ప్రత్యేక ప్రదేశం ఉంటుంది. ఈ మట్టిని ప్రతీరోజూ తవ్వి, నీరు చల్లి, నూనెలు లేదా ఔషధ మూలికలతో కలిపి మెత్తగా తయారు చేస్తారు. యువకులు ఈ మట్టిలోనే సాధన చేస్తారు. ఇక కసరత్తుల కోసం వ్యాయామ పరికరాలు, శిక్షణకు అవసరమైన ఇతర సాధనాలుంటాయి.
సాంస్కృతిక ప్రాముఖ్యత
అఖాడాలు యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా, సంప్రదాయ భారతీయ క్రీడలను సంరక్షించే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాయి. శారీరక దృఢత్వం, మానసిక క్రమశిక్షణ, నైతిక విలువలు... సామాజిక ఐక్యతను పెంపొందించే కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు పెరిగినప్పటికీ, వారణాసిలోని అనేక అఖాడాలు ఇప్పటికీ సంప్రదాయ వ్యాయామ శిక్షణను కొనసాగిస్తున్నాయి. వారణాసి సాంస్కృతిక సంప్రదాయాలలో అఖాడాలు ఒక భాగంగా గుర్తింపు పొందాయి. అఖాడాలు డబ్బు, సామాజిక హోదాతో సంబంధం లేకుండా యువకులను చేర్చుకుని శిక్షణ అందిస్తుంటాయి. పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అతి పెద్ద కుంభమేళా విజయవంతం కావడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
పహిల్వాన్ల అడ్డా...
అఖాడాలు ఎంతోమంది కుస్తీ యోధులను తయారుచేశాయి. వారిలో గులాం మహమ్మద్ ఒకరు. 20వ శతాబ్దం ప్రారంభంలో గులాం మహమ్మద్ గురించి కథలుకథలుగా చెప్పుకునేవారు. 5వేల గుంజీలు, 3వేల పుషప్‌లు తీసేవాడని అంటారు. ఆయన తన మెడకు 54 కేజీల బరువున్న గుండ్రటి రాయిని వేలాడదీసుకుని కిలోమీటరు దూరం పరుగెత్తేవాడట. రోజూ 20 లీటర్ల పాలు, నాలుగు కిలోల పండ్లు, రెండు కప్పుల నెయ్యి ఆయన డైట్‌లో ఉండేదట. 1928లో జన్మించిన దారాసింగ్ వల్ల కూడా కుస్తీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సినిమాల్లో నటించడం ద్వారా ఆయన అందరికీ సుపరిచితుడయ్యారు. సాక్షిమాలిక్ ఒలింపిక్‌లో మెడల్ సాధించిన మొదటి మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందారు.
ఆధునిక వ్యాయామశాలల రాకతో...
కాలంతో పాటు వ్యాయామశాలల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ప్రాచీన కాశీలో 1000 అఖాడాల వరకు ఉండేవి. కాలక్రమంలో చాలావరకు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వేళ్ల మీద లెక్కబెట్టే అఖాడాలు మాత్రమే ఉన్నాయి. ఆధునిక జిమ్‌లు రావడంతో అఖాడాలు తగ్గిపోయాయి. ఇప్పుడు యువకులు అత్యాధునిక పరికరాలు ఉన్న ఆధునిక వ్యాయామశాలల్లో, ఫిట్‌నెస్ సెంటర్లలో కసరత్తులు చేసేందుకు ఇష్డపడుతున్నారు.
‘దంగల్’ సినిమా తరువాత....
దంగల్ సినిమా తరువాత మహిళల ప్రవేశం విషయంలో అఖాడాలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. గతంలో అఖాడాల్లోకి మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. కానీ ‘దంగల్’ సినిమా స్ఫూర్తితో అఖాడాలు మహిళా రెజ్లర్లకు ఆహ్వానం పలికాయి. ప్రారంభమైన 478 ఏళ్ల తరువాత మొదటిసారి మహిళలకు అఖాడాల్లోకి ప్రవేశం లభించింది. ప్రస్తుతం మహిళలు రెజ్లింగ్ పోటీల్లో దూసుకెళుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.
వారణాసిలోని తులసీఘాట్‌లో ఉన్న స్వామినాథ్ అఖాడా మహిళా రెజ్లర్లకు శిక్షణనిస్తోంది. ‘‘కుస్తీ పోటీల్లో మెలకువల గురించి వారికి తెలియదు. కానీ నేర్చుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉంటుంది. నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే చాలు’’ అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. వారణాసిలోనే ఉన్న స్వామినాథ్ అఖాడాను 16వ శతాబ్దంలో నిర్మించారు. ‘‘మహిళలకు పురుషులతో సమానంగా ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తారు’’ అని స్వామినాఽథ్ అఖాడా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న డా. విశ్వంభర్‌నాథ్ మిశ్రా అంటారు.
శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని బద్దలు కొట్టి... అఖాడాల్లోకి మహిళలు ప్రవేశం పొందేలా చేసిన ఘనత ఆయనది. ఆయన ప్రొఫెసర్‌గానూ, సంకటమోచన్ ఆలయంలో మహంత్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అఖాడాలు సహాయపడతాయని ఆయన బలంగా నమ్ముతారు. ఈ అఖాడాలో సుమారు 50 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. ఇక తులసీ అఖాడాలో డజనుకు పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ‘దంగల్’ సినిమా తరువాత కుస్తీపై ఆసక్తి పెంచుకున్న వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పదేళ్ల పలక్ యాదవ్ ఒకరు.
‘‘మా తాత కల్లు యాదవ్ కుస్తీ నేర్చుకున్న ప్రదేశంలో నేనూ నేర్చుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’’ అని అంటారు పలక్ యాదవ్. స్థానికంగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో ఆమె విజేతగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.
వారణాసిలో అనేక అఖాడాలున్నాయి. అత్యంత పురాతన అఖాడాలకు ఇది నిలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన అఖాడాలు ఇప్పటికీ కుస్తీ శిక్షణ అందిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాయి. వాటిలో కొన్ని...
తులసీ అఖాడా: కాశీలో ఉన్న అఖాడాలలో తులసీ అఖాడాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తులసీ ఘాట్‌కు సమీపంలో ఉన్న ఈ అఖాడా ఎంతోమంది పహిల్వాన్లను అందించింది.
అఖారా స్వామినాథ్: వారణాసిలో ఉన్న క్రియాశీల సంస్థలలో పురాతనమైనది ఇది. 13 తరాలుగా ఒకే కుటుంబం ఈ అఖాడా బాధ్యతలు చూసుకుంటోంది. పురుషులు, మహిళలు తేడా లేకుండా అందరికీ కుస్తీలో మెలకువలు నేర్పిస్తోంది.
మన్సూరోవ్ అఖార: రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అఖాడా ఇది. మన్సూర్ ఘాట్‌లో ఉంటుంది. సంప్రదాయ పరికరాలతో శిక్షణనిస్తూ మల్లయోధులను తీర్చిదిద్దుతోంది.
మనదేశంలోని అఖాడాలన్నీ అఖిల భారతీయ అఖారా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇందులో శివున్ని ఆధారించే శైవ అఖాడాలు ఏడు ఉంటే, వైష్ణవ మతాన్ని అనుసరించే వైష్ణవ అఖాడాలు మూడున్నాయి. ఉదాసిన్, నిర్మల అఖాడాలు మరో మూడున్నాయి. మొత్తంగా వారణాసితోపాటు దేశవ్యాప్తంగా చాలా అఖాడాలు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని...
గురు హనుమాన్ అఖాడా: ఇది ఢిల్లీలో ఉంది. అఖాడాలలో ప్రముఖ శిక్షణా కేంద్రంగా గుర్తింపు పొందింది. ఒలింపిక్ స్థాయి ఇండియన్ రెజ్లర్స్‌కు శిక్షణా కేంద్రం ఇది.
మారుతి అఖాడా: పుణేలో ఉంది. ఈ అఖాడా స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉంది. మహారాష్ట్ర కుస్తీ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
మొత్తానికి ఆధ్యాత్మిక కేంద్రం కాశీలో అతి పురాతన ఆఖాడాలు ఇప్పటికీ ఓ పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ... యువతరంతో కళకళలాడుతుండటం విశేషమే కదా!
నమస్కరించిన తర్వాతే...
అఖాడాకు మల్లయోధులు కుస్తీ పట్టే ప్రదేశం (పిట్) గుండెలాంటిది. రెండు, మూడు అడుగుల లోతుతో ఉండే పిట్‌ను ఎర్రమట్టితో నింపుతారు. ఈ మట్టిలో నెయ్యి, పాలు, ఆవాల నూనె, నిమ్మరసం, కొన్నిసార్లు కర్పూరం వేసి బాగా కలుపుతారు. దీనివల్ల మట్టి మెత్తగా తయారవుతుంది. అంతేకాకుండా చల్లదనాన్నిస్తుంది. సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. మల్లయోధులు ఈ పిట్‌కు నమస్కరించిన తరువాతే బరిలోకి దిగుతారు. ప్రతీరోజూ శిక్షణకు ముందు మట్టిని వదులుగా చేస్తుంటారు. అలాగే ఎగుడు దిగుడు లేకుండా మట్టి సమానంగా ఉండేలా కర్రకు తాడు కట్టి లాగుతారు.
ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో అఖాడాలను స్థాపించారంటారు. విదేశీ దండయాత్రల నుంచి హిందూమతాన్ని రక్షించేందుకు యోధులను తయారుచేయాలనే ఉద్దేశంతో అఖాడాలను నెలకొల్పారని, ప్రారంభంలో ఇవి ఆధ్యాత్మిక విద్యను బోధించడంతో పాటు... యుద్ధ విద్యలో శిక్షణను అందించాయని అంటారు. హిందూ దేవాలయాలను, మఠాలను కాపాడటం, భక్తులకు రక్షణ కల్పించడం వంటివి బాధ్యతలు నిర్వర్తించేవని చరిత్రకారులు అంటారు.
అఖాడాలో రెజ్లర్స్ కసరత్తుల కోసం ఉపయోగించే పరికరాలన్నీ కలపతో తయారుచేసినవే ఉంటాయి. చాలా బరువుగా ఉంటాయి. వాటిలో గద, నాల్ (గుండ్రంగా ఉండే చక్రం), జోడి (రెండు చేతులతో పట్టుకుని శరీరం చుట్టూ తిప్పేది), సంతులన్ (త్రాసు) వంటి పరికరాలు ముఖ్యమైనవి.
- సండే డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి:
హే రామ్.. హే రావణ్.. ఇంత విద్వేషమా?
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News