Share News

సీజేపీ నిరసనల్లో ఉద్రిక్తత.. నలుగురు మాజీ సీఎంలు సహా 1,500 మందికి పైగా అరెస్ట్

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:42 PM

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఓటర్ల జాబితాలో అక్రమాల సవరణను డిమాండ్ చేస్తూ సీజేపీ ఇచ్చిన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా 1,500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీజేపీ నిరసనల్లో ఉద్రిక్తత.. నలుగురు మాజీ సీఎంలు సహా 1,500 మందికి పైగా అరెస్ట్
Delhi Protest Over 1500 Detained

ఇంటర్నెట్ డెస్క్: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయడం సహా ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఇచ్చిన పిలుపుతో ఢిల్లీలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు.. భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన 1,500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మాజీ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, మాణిక్‌ సర్కార్‌ ఉన్నారు. సీపీఎం నేతలు ఎంఏ.బేబీ, బృందా కారత్‌, దీపాంకర్‌ భట్టాచార్య, ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌ రాయ్‌, టీఎంసీ నేతలు డెరిక్‌ ఓబ్రెయిన్‌, డోలా సేన్‌, సాకేత్‌ గోఖలే తదితరులు ఉన్నారు.


సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, నేతలు ఆశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌ ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీని గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళలు, వృద్ధులను విడుదల చేస్తామని పోలీస్ వర్గాలు తెలిపాయి. రేపు(ఆదివారం) కూడా నిరసనలు చేపట్టే అవకాశముండటంతో భద్రతా చర్యలను కొనసాగిస్తామన్నాయి.


అందరినీ అరెస్ట్ చేయండి: రాహుల్‌

తమిళనాడులోని చెన్నైలో విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. నాయకులందరితో పాటు యువతనూ అరెస్ట్ చేయాలని, అయినా వెనక్కి తగ్గబోమని ఎక్స్‌లో చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా.. ఈ వారంలో ఢిల్లీలో 4 రోజులపాటు నిరసనలకు నాయకత్వం వహించిన రాహుల్‌.. సోమవారం సీజేఐ సూర్యకాంత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.


ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా యువత ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే కూర్చుని ఆ ప్రాంతాన్ని జంతర్‌మంతర్‌గా మార్చాలని కోరారు. కాగా.. కేజ్రీవాల్ తన నివాసం నుంచి జంతర్‌మంతర్‌ వైపు వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ అవెన్యూలో నిరసన చేపట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నోటికి బ్యాండేజ్‌ వేసుకుని నిరసన తెలిపిన ఆమె. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని మించిపోయిందన్నారు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్‌ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు

సీజేపీ నిరసన అట్టర్‌ ఫ్లాప్‌.. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర

Updated Date - Oct 10 , 2026 | 09:01 PM