ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:17 PM
ఢిల్లీలో సీజేపీ నిరసన నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. 22 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది మోహరింపు, మెట్రో స్టేషన్ల మూసివేత, నిరసనకారుల అరెస్టులపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణపై ప్రజలకున్న సందేహాలను నివృతి చేయాల్సింది పోయి, రాజధానిని దిగ్బంధించడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని ఆయన విమర్శించారు. ఎన్నికల నిష్పాక్షికతపై విశ్వాసం ఉన్న ప్రభుత్వం.. ప్రజల ప్రశ్నలకు సమాధానాలివ్వాలే తప్ప వారిపై లాఠీలు ఎత్తడం ఏమాత్రం సరికాదని ఎక్స్ వేదికగా మండిపడ్డారాయన.
కాగా.. జంతర్ మంతర్ వద్ద ప్రధాన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పలు పార్టీ నేతలు, వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు శశి థరూర్. నగరంలో కొద్దిపాటి దూరంలో ప్రతిచోటా తనిఖీ కేంద్రాలు, బారికేడ్లు, రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్(ఇనుప మేకుల్లాంటివి) ఏర్పాటు చేశారన్నారు. సుమారు 22 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించడం సహా 250 రైళ్లను రద్దు చేశారని, 45 మెట్రో స్టేషన్లను మూసివేశారని పేర్కొన్నారు. పలువురు యువతను ఇళ్లు, వీధుల్లో నుంచే అదుపులోకి తీసుకొంటున్నారని కూడా తెలుస్తోందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ నగరం నడిబొడ్డున అంతర్జాల సేవలను బంద్ చేయడాన్ని మరింత దిగజారుడు చర్యగా థరూర్ అభివర్ణించారు. ప్రజలు నిరసన తెలిపేందుకు ఉద్దేశించిన జంతర్ మంతర్ మార్గాలను మూసివేయడాన్ని తప్పుబట్టిన ఆయన.. మహిళలకు రక్షణ కల్పించాల్సిన సమయంలో కనిపించని ఈ భారీ పోలీస్ బలగాలు, ఇప్పుడెక్కడి నుంచి పుట్టుకొచ్చాయని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న నిరసనకారులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి సోమవారంనాడు మరోసారి తలెత్తితే.. మళ్లీ దిగ్బంధిస్తారా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీని గుర్తుచేసేలా ‘ఎమర్-జెన్‌జీ(Emer-GenZ)’ ఉందంటూ ప్రభుత్వ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇవీ చదవండి:
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి
ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్