బెంగళూరులో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు కేరళం వాసుల అరెస్ట్!
ABN , Publish Date - Oct 14 , 2026 | 08:22 AM
గంజాయి అక్రమ రవాణాపై బెంగళూరు పోలీసులు కొరడా ఝళిపించారు. కిరాయి కారులో కేరళంకు తరలిస్తున్న 317 కిలోల గంజాయిని కుంబళగోడు పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గంజాయి అక్రమ రవాణాపై బెంగళూరు పోలీసులు కొరడా ఝళిపించారు. కిరాయి కారులో కేరళంకు తరలిస్తున్న 317 కిలోల గంజాయిని కుంబళగోడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని అక్రమ మార్కెట్ విలువ సుమారు రూ.3.17 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఈ ఘటనలో కేరళంకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 6న కేరళం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని ఓ వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 11న బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఓ కారును అద్దెకు తీసుకుని సెల్ఫ్ డ్రైవింగ్లో సదరు గంజాయిని కేరళంకు తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఈ నెల 12న కుంబళగోడు వద్ద పోలీసులు కారు ఆపి తనిఖీలు చేయడంతో వీరి గుట్టు రట్టయింది. మొత్తం 317 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
సీజ్ చేసిన గంజాయి విలువ అక్రమ మార్కెట్లో రూ.3.17 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చదవండి:
పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్
మహిళా జర్నలిస్టును రాహుల్ తోసేశారు