మహిళా జర్నలిస్టును రాహుల్ తోసేశారు
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:12 AM
ఢిల్లీలో సోమవారం సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాల మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గర్భిణి అయిన ఓ మహిళా జర్నలిస్టును తోసివేశారని, ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని బీజేపీ మంగళవారం ఆరోపించింది.
ప్రతిపక్షాల ర్యాలీలో గర్భిణినినెట్టివేయడంతో ఆమె కింద పడ్డారు
ఇదేనా మహిళలపై మీ గౌరవం?: బీజేపీ
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ఢిల్లీలో సోమవారం సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాల మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గర్భిణి అయిన ఓ మహిళా జర్నలిస్టును తోసివేశారని, ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. రాహుల్ ఆ మహిళా జర్నలిస్టును నెట్టడంతో కింద పడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. ఆమెకు గాయాలయ్యాయి. మహిళా హక్కులు, గౌరవం గురించి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఇదేనా అని బీజేపీ నేతలు విమర్శించారు. రాహుల్ తనను నెట్టివేశారని వన్ ఇండియా అనే న్యూస్ వెబ్సైట్లో పనిచేసే జర్నలిస్టు రిచా పరాశర్ చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. రాహుల్‌ను తాను ఏ ప్రశ్నలూ అడగలేదని, తనను నెట్టివేయడంతో మెట్లపై నుంచి కింద పడిపోయానని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో తన కెమెరా పర్సన్ కూడా తనపై పడ్డారని, తాను నేలపై బోర్లా పడ్డానని, తన పొట్టకు చేతులను అడ్డుగా పెట్టుకొని బిడ్డను కాపాడుకున్నానని పేర్కొన్నారు. మరోవైపు, ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ ర్యాలీలో కర్ణాటక సీఎం శివకుమార్ చొక్కా పట్టుకుని రాహుల్ గాంధీ వెనక్కి లాగిన వీడియో వైరల్ అయింది. ‘‘ఇది 7కోట్లమంది కన్నడిగులకు జరిగిన అవమానం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేసింది.