Share News

35 వేల అడుగుల ఎత్తులో పవర్‌ బ్యాంక్‌‌లో మంటలు.. కారణమిదే?

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:08 PM

లిథియం బ్యాటరీల్లో లోపాలు, అధిక వేడి, షార్ట్ సర్క్యూట్ వల్ల విమానాల్లో పవర్ బ్యాంక్ మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఇటీవల ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించిన ఘటన నేపథ్యంలో థర్మల్ రన్‌అవే అంటే ఏమిటి, పవర్ బ్యాంకులను ఎలా తీసుకెళ్లాలి, ప్రయాణికులు పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

35 వేల అడుగుల ఎత్తులో పవర్‌ బ్యాంక్‌‌లో మంటలు.. కారణమిదే?
What makes power banks catch fire at 35,000 feet in flights

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ కోసం ఉపయోగించే చిన్న పవర్‌ బ్యాంక్‌.. విమాన ప్రయాణాల్లో పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. లిథియం బ్యాటరీల్లో తలెత్తే లోపాలు, అధిక వేడి వల్ల మంటలు చెలరేగే అవకాశముండటమే ఇందుకు కారణం. ఇటీవల డిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి ఎలక్ట్రానిక్ పరికరంలో ఇదే తరహాలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని హుటాహుటిన హైదరాబాద్‌కు మళ్లించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో బ్యాటరీల భద్రతపై మరోసారి చర్చ జోరందుకుంది.


బ్యాటరీలో ఏమవుతుంది?

పవర్‌ బ్యాంకుల్లో సాధారణంగా లిథియం అయాన్‌ లేదా లిథియం పాలిమర్‌ బ్యాటరీలు ఉంటాయి. వీటిలో పరిమిత స్థలంలోనే ఎక్కువ శక్తి నిల్వ ఉంటుంది. తయారీలో లోపాలు, బ్యాటరీ డ్యామేజ్ కావడం, అధిక వేడి, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ లాంటి కారణాలతో బ్యాటరీలోని రసాయన చర్యలు అదుపు తప్పే అవకాశం(థర్మల్‌ రన్‌అవే) ఉంది. ఈ ప్రక్రియలో బ్యాటరీ ఉష్ణోగ్రత వేగంగా పెరిగి.. మండే వాయువులు, పొగ వెలువడటం కారణంగా మంటలు చెలరేగవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్కనున్న బ్యాటరీ సెల్స్‌కూ మంటలు వ్యాపించే ప్రమాదముంది.


క్యాబిన్‌లోనే ఎందుకు ఉంచాలి?

పవర్‌ బ్యాంకులను తనిఖీ చేసిన సామగ్రి(చెక్‌-ఇన్‌ బ్యాగేజీ)లో ఉంచడంపై విమానయాన సంస్థలు ఆంక్షలు విధిస్తాయి. కార్గో విభాగంలో మంటలు చెలరేగితే వాటిని గుర్తించి స్పందించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. లిథియం బ్యాటరీ మంటలను అదుపు చేయడం కష్టమవడంతోపాటు అవి మళ్లీ చెలరేగేందుకు అవకాశముంటుంది. క్యాబిన్‌లో ఉంటే పొగను సిబ్బంది త్వరగా గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.

Lithium Batteris.webp


ఎత్తు ఒక్కటే కారణం కాదు!

విమానంలో క్యాబిన్‌ ఒత్తిడి సముద్ర మట్టంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి హీట్ ట్రాన్స్‌ఫర్, బ్యాటరీ నుంచి వెలువడే వాయువుల ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చు. అయితే విమానం ఎత్తులో ప్రయాణించడమే బ్యాటరీ మంటలకు ప్రధాన కారణం కాదు. బ్యాటరీలో అంతర్గత లోపాలు, దెబ్బతినడం, అధిక వేడి, విద్యుత్‌ వంటి సమస్యలూ ఉంటాయి.


ప్రయాణికులు ఏం చేయాలి?

పవర్‌ బ్యాంకులను విమానంలో అనుమతించిన నిబంధనల ప్రకారం.. క్యాబిన్‌ బ్యాగేజీలోనే తీసుకెళ్లాలి. డ్యామేజ్ అయిన, ఉబ్బిన లేదా త్వరగా వేడెక్కుతున్న బ్యాటరీలను ఉపయోగించకూడదు. లోహపు వస్తువులతో బ్యాటరీ టెర్మినల్స్‌ తగలకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. విమానయాన సంస్థ సూచించిన సామర్థ్య పరిమితులు, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చిన్న పరికరమే అయినా బ్యాటరీలో లోపం తలెత్తితే విమాన భద్రతకు తీవ్ర ముప్పుగా మారే అవకాశముంది.


ఇవీ చదవండి:

అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Updated Date - Oct 13 , 2026 | 05:18 PM