ఏడు గ్రహశకలాలే లక్ష్యంగా.. యూఏఈ అంతరిక్ష యాత్ర!
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:04 PM
సౌర కుటుంబ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునేందుకు యూఏఈ ఎమిరేట్స్ మిషన్ టు ది ఆస్టరాయిడ్ బెల్ట్‌ను చేపట్టనుంది. 2028 మార్చిలో ప్రయోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఈ మిషన్ సుమారు 5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి, 2036 ప్రారంభంలో 269 జస్టిటియా గ్రహశకలంపై ప్రోబ్‌ను దింపాలని ప్రణాళిక రూపొందించింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను ఛేదించాలనే లక్ష్యంతో యూఏఈ సరికొత్త అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది. ప్రధాన గ్రహశకలాల వలయంలోని ఆరింటిని దగ్గరి నుంచి పరిశీలించడం సహా ఏడో గ్రహశకలమైన 269 జస్టిటియా ఉపరితలంపై ప్రోబ్‌ను దింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మిషన్ కోసం యూఏఈకి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్(టీఐఐ) ప్రత్యేక ప్రోబ్‌ను అభివృద్ధి చేసింది.
5 బిలియన్ కిలోమీటర్ల ప్రయాణం
ఎమిరేట్స్ మిషన్ టు ది ఆస్టరాయిడ్ బెల్ట్(ఈఎంఏ)లో భాగంగా చేపట్టనున్న ఈ యాత్రకు సంబంధించి.. 2028 మార్చిలో జపాన్ నుంచి ఓ వ్యోమనౌకను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది యూఏఈ. సుమారు 5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించే ఈ మిషన్ 8 ఏళ్ల పాటు కొనసాగనుంది. శుక్రుడు, భూమి, అంగారక గ్రహాల గురుత్వాకర్షణ శక్తులను వినియోగించుకుంటూ ఈ మిషన్ తన గమ్యస్థానాన్ని చేరుకోనుంది. 2036 ప్రారంభంలో జస్టిటియా గ్రహశకలం సమీపంలో ప్రోబ్‌ను విడదీసి.. దాని ఉపరితలంపై దింపేలా టీఐఐ ప్రయత్నిస్తోంది.

సౌర కుటుంబ ఆవిర్భావంపై అధ్యయనం
కుజుడు(అంగారకుడు), గురు గ్రహాల మధ్యనున్న ప్రధాన గ్రహశకలాల వలయంలోని జస్టిటియా.. ప్రత్యేకమైన ఎరుపు రంగుతో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. నెఫ్ట్యూన్‌కు వెలువల ఉన్న కూయిపర్ బెల్ట్‌లోని కొన్ని ఖగోళ వస్తువులతో.. దీని లక్షణాలకు పోలికలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు పరిశోధకులు. తొలుత ఇది కూయిపర్ బెల్ట్ నుంచి లోపలి సౌర కుటుంబంలోకి చొరబడి ఉండొచ్చని భావిస్తున్నారు. దీని అధ్యయనంతో నీరు, సేంద్రీయ పదార్థాలు.. గ్రహాల ఏర్పాటులో ఎలా పంపిణీ అయ్యాయనే విషయం బయటపడే అవకాశముంది.
యూఏఈ రాజధాని అబుదాబిలోని టీఐఐ పరిశోధకులు ఈ ప్రోబ్‌ను అభివృద్ధి చేసి పరీక్షించారు. భూమి నుంచి లేదా ప్రధాన వ్యోమనౌక నుంచి నిరంతర ఆదేశాలు అందకపోయినా.. సొంతంగానే ఇది నిర్ణయాలు తీసుకోగలదు. ఇందులో అమర్చిన రెండు కెమెరాలు గ్రహశకల చిత్రాలను వివిధ స్థాయిల్లో నమోదు చేస్తాయి. ఉపరితలానికి చేరువగా ఫొటోలు తీయడం సహా అక్కడి పదార్థాల కూర్పు, భౌతిక లక్షణాలను పరిశీలించేందుకు దీనిని రూపొందించారు. కాగా.. యూఏఈ చేపడుతున్న రెండో అంతరిక్ష గ్రహాంతర మిషన్ ఇది. వ్యోమనౌక రూపకల్పన నుంచి నిర్మాణం, పరీక్షల వరకు దేశీయంగా చేపట్టిన తొలి మిషన్‌గా దీనికి ప్రత్యేకత ఉంది. అంతరిక్ష సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆ దేశం వేస్తున్న కీలక అడుగుగా ఈ ప్రాజెక్ట్‌ను భావిస్తున్నారు పరిశోధకులు.
ఇవీ చదవండి:
అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ
గుజరాత్ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం