Share News

అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:46 PM

బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ టెక్నాలజీ, డేటా, నాలెడ్జ్‌ను కోట్లాది మందికి అవకాశాలు కల్పించేలా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. భారత్ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైందని, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 300 గిగావాట్లకు చేరిందని తెలిపారు.

అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ
PM Modi on Bloomberg New Economy Forum

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ, డేటా, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అనేవి నేటి ప్రపంచంలో అత్యంత కీలక శక్తులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటిని కొందరి ప్రయోజనాలకే పరిమితం చేయకుండా.. కోట్లాది మందికి కొత్త అవకాశాలు కల్పించేందుకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన.. పోటీకి బదులుగా సహకారం, నియంత్రణకు బదులుగా సాధికారత లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.


ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన పునాదులపై నిలిచి ఉందని ఈ సందర్భగా మోదీ ప్రస్తావించారు. దీంతో 2026-27 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. హరిత ఇంధన రంగంలోనూ భారత్ గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. 2014లో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సుమారు 75 గిగావాట్లుగా ఉండగా.. ప్రస్తుతం అది 300 గిగావాట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చారు. దీంతో స్వచ్ఛ ఇంధన రంగం కొత్త ఆర్థిక అవకాశాలకు మార్గం సుగమం చేస్తోందని తెలిపారు మోదీ.


ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు

భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటిదని అభివర్ణించిన మోదీ.. దేశంలో 100కు పైగా భాషలు, సుమారు 80 వేల వార్తాపత్రికలు, ప్రచురణలు, వెయ్యికి పైగా శాటిలైట్‌ టీవీ ఛానళ్లు ఉన్నాయని తెలిపారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా అకౌంట్లలోనూ 50 కోట్ల మందికి భారతీయులు చురుగ్గా ఉంటున్నారని వివరించారు. వ్యక్తుల భిన్నాభిప్రాయాలను బహిరంగంగా చర్చించుకునేందుకు డిజిటల్‌ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతోందన్నారు.


ప్రజల సాధికారతే లక్ష్యం

ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ.. అజమాయిషీ చెలాయించడం, ప్రజలను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం దాని లక్ష్యం కాకూడదని మోదీ పేర్కొన్నారు. బదులుగా వారిని మరింత బలోపేతం చేసి, సాధికారత కల్పించి ఎదిగేలా చేయడానికి అది ఉపయోగపడాలని.. ప్రస్తుతం భారత్ అదే మార్గంలో పయనిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న ఆయన.. ఇది ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే

ఢిల్లీ నిరసనల కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 13 , 2026 | 01:01 PM