ఢిల్లీ నిరసనల కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:14 PM
ఢిల్లీ నిరసనలకు సంబంధించి ప్రస్తుతం పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. వీటిల్లో కొన్నింటిపై తక్షణ విచారణ చేపట్టడం సాధ్యపడకపోవచ్చని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. ముందుగా వాటికి సంబంధించిన ఫైల్స్ పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ నిరసనలకు సంబంధించి ప్రస్తుతం పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. నిరసనలకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై విచారణ జరపాలంటే సంబంధిత ఫైళ్లను పరిశీలించాలని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులను విచారణకు స్వీకరిస్తామని, అయితే నేడు సాధ్యం కాకపోవచ్చని, రేపు విచారణ చేస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు, న్యాయవాదులపై దాడులు జరిగాయని పేర్కొంటూ బార్ సభ్యులకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ ప్రస్తావించారు. ఈ కేసును నేడు విచారించాలని ఆయన కోరగా, నేడు సాధ్యం కాదని సీజేఐ స్పష్టం చేశారు. జస్టిస్ మోహనా అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విచారణకు హాజరయ్యారని సీజేఐ ఈ సందర్భంగా తెలిపారు. ముందుగా పిటిషన్లలోని లోపాలను సరిచేయాలని సూచించారు. లోపాలు సరిచేస్తే అన్ని పిటిషన్లను విచారణకు జాబితా చేస్తామన్నారు. రేపు ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్య విచారణ చేపట్టే అవకాశం ఉందని, ఇవి చాలా తీవ్రమైన అంశాలని, వాటిని పరిశీలించాలని అనుకుంటున్నామని సీజేఐ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే
ఢిల్లీకి డార్క్ సూపర్‌హీరో అవసరం లేదు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..