సగం మంది వెన్నునొప్పి బాధితులే..!
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:33 AM
గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, బైక్, కారును దూర ప్రాంతాలకు నడపడం, బరువులను ఇష్టానుసారంగా ఎత్తడం వంటి వాటి వల్ల వెన్ను నొప్పి సమస్యలు వస్తుంటాయి.
డ్రైవింగ్, డెస్క్ వర్క్ చేసే వారిలో అధిక సమస్యలు
జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం
నేడు వరల్డ్ స్పైన్ డే
హైదరాబాద్ సిటీ: గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, బైక్, కారును దూర ప్రాంతాలకు నడపడం, బరువులను ఇష్టానుసారంగా ఎత్తడం వంటి వాటి వల్ల వెన్ను నొప్పి సమస్యలు వస్తుంటాయి. డ్రైవింగ్ చేసే వారిలో దాదాపు 30 నుంచి 40 శాతం మంది బ్యాక్పెయిన్తో బాధపడుతున్నారు. ఆర్థో సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో సగం మంది వెన్ను ఇబ్బందితోనే వస్తున్నారని, 55 శాతం మంది యువత దీని బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నేడు వరల్డ్ స్పైన్ డే సందర్భంగా వెన్ను సమస్యలు, నివారణ పద్ధతులపై వైద్యుల సూచనలు మీకోసం..
చిన్నపాటి జాగ్రత్తలతో 95 శాతం సమస్యలు దూరం
ఐటీ ఉద్యోగులు, రికార్డు అసిస్టెంట్లు, రిసెప్షనిస్టులు, గుమస్తాలు, టెలిఫోన్ ఆపరేటర్లు, డ్రైవర్లు వెన్ను సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే 95 శాతం వెన్ను నొప్పికి చెక్ పెట్టవచ్చంటున్నారు డాక్టర్లు. కుర్చీలో, కింద కూర్చునే సమయంలో వెన్ను నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలి. కుర్చీలో వీపు వైపు సీటు భాగం మెడ వరకు ఉంటే మంచిది. కుర్చీలో కూర్చున్నప్పుడు రెండు కాళ్ల పాదాలు భూమికి, రెండు చేతులు కుర్చీ హ్యాండిల్కు ఆనించి ఉండాలి. ప్రతీ 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి లేచి అలా తిరిగి రావాలి. నేలపైన ఉన్న వస్తువులను అకస్మాత్తుగా కిందకు వంగి తీసుకోవద్దు. వంగి బైక్ నడుపొద్దు. బైక్ హ్యాండిల్ సరైన ఎత్తులో లేకపోతే వెన్నునొప్పి వస్తుంది. ఎగుడుదిగుడు రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలి. కారు సిట్టింగ్ సరిగ్గా లేకపోయినా, క్లచ్, గేర్ కాళ్లు, చేతులకు దూరంగా ఉన్నా డిస్క్లో అరుగుదల ఉంటుంది.
డాక్టర్లను సంప్రదించాలి
వంగి పనులు చేసే వారు, బరువులు ఎత్తే వారిలో నడుము నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ప్రసవాల సమయాల్లో హార్మోన్, శారీరక ఇబ్బందుల వల్ల వెన్ను నొప్పులు వస్తుంటాయి. నడుము నుంచి కాళ్ల వరకు లాగడం, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, కాలును బలంగా అటు ఇటు కదపలేకపోవడం, మోకాలి వద్ద కదలికలు లేకపోవడం, మూత్ర నియంత్రణ లేకపోవడం, చేతి లో పట్టు తగ్గడం, నొప్పులతో ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కళ్యాణ్ కుమార్ వర్మ, సీనియర్ స్పైన్ సర్జన్, ఏఐజీ ఆస్పత్రి
నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
వెన్నునొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారినీ వేధిస్తోంది. తరచూ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అనిన మెడ, వెన్ను నొప్పులకు శస్త్రచికిత్స అవసరం లేదు. చాలామందికి మందులు, ఫిజియోథెరపీ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులతో ఉపశమనం లభిస్తుంది. పిల్లలు మొబైల్ ఫోన్లతో గడిపే సమయాన్ని తగ్గించి బయట ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
రణదీర్ కుమార్, క్లినికల్ డైరెక్టర్, ఎండోస్కోపీ స్పైన్ సర్జన్, కేర్ ఆస్పత్రి
ఎండోస్కోపిక్ సర్జరీతో ఉపశమనం
వయస్సు పెరిగిందని వెన్నెముక సమస్యలతో బాధపడుతూ జీవించాల్సిన అవసరం లేదు. వృద్ధుల్లో వెన్నెముక అరుగుదల కారణంగా వచ్చే నడుము నొప్పి, కాళ్లలో తిమ్మిరి, నడవడంలో ఇబ్బందులకు యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. వయస్సుతో పాటు వెన్నెముకలో వచ్చే మార్పుల వల్ల నరాల మార్గం ఇరుకుగా మారడాన్ని లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటారు. దీని చికిత్సకు రెండు చిన్న ప్రవేశ మార్గాల ద్వారా కెమెరా, ప్రత్యేక పరికరాలతో నరాలపై ఒత్తిడిని తగ్గిస్తారు.
పెడ్డినేని అనుదీప్, స్పైన్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News