Share News

ఇరాన్‌పై మదర్‌ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం.. యోచనలో అమెరికా

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:19 AM

ఇరాన్‌పై మరింత భారీ దాడులకు దిగే యోచనలో అమెరికా సర్కారు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అణ్వాయుధాల తరువాత తమ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌తో ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికా భావిస్తోంది.

ఇరాన్‌పై మదర్‌ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం.. యోచనలో అమెరికా
Mother Of all Bombs

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అమెరికా సతమతం అవుతోంది. వచ్చే నెలలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింత భారీ దాడులకు దిగే యోచనలో అమెరికా సర్కారు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అణ్వాయుధాల తరువాత తమ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌తో ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికా భావిస్తోంది.

ఏమిటీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్..

ఈ బాంబు సాంకేతిక నామం జీబీయూ-43/బీ మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎమ్ఓఏబీ). యూఎస్ వద్ద ఉన్న సంప్రదాయక బాంబుల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే దీనికి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పేరు వచ్చింది. ఇరాన్ ఇంధన వసతులు, అణు వసతులపై ఈ బాంబుతో దాడి చేయాలని అమెరికా యోచిస్తోంది. ఇరాన్‌పై ఇప్పటివరకూ ఈ బాంబును అమెరికా ప్రయోగించలేదు.


ఈ విషయంలో అమెరికా ముందడుగు వేస్తే యుద్ధం మరింత ముదిరినట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎమ్ఓఏబీ ప్రయోగంతో అమెరికా లక్ష్యాలు నెరవేరకపోవచ్చన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ అణు మౌలిక వసతులను భూగర్భ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిల్లోకి చొచ్చుకెళ్లే శక్తి ఎమ్ఓఏబీకి ఉండదని కొందరు కామెంట్ చేశారు. యుద్ధ క్షేత్రంలో శత్రుమూకలను చెల్లాచెదురు చేయాలనే లక్ష్యంతో ఈ బాంబును రూపొందించారు. భూగర్భ సొరంగాల్లో దాగున్న టార్గెట్లను ఇది చేరుకోలేదని అంటున్నారు. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకూడదన్న అమెరికా ప్రధాన లక్ష్యం ఈ బాంబుతో సాకారం కాబోదని అంటున్నారు.


యుద్ధం నుంచి బయటపడేందుకే..

తమ ఆయుధ సంపత్తిని చూసి శత్రువు గుండెల్లో వెరపుపుట్టించే లక్ష్యంగా ఈ బాంబు దాడి ఉపయోగపడవచ్చని అమెరికా మిలిటరీ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా ఈ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు ట్రంప్ సర్కారుకు ఓ అవకాశం లభించినట్టు అవుతుందని అంటున్నాయి. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకూడదన్న లక్ష్యం నెరవేరకపోయినా ప్రస్తుతానికి పరిస్థితుల నుంచి గౌరవంగా గట్టెక్కే అవకాశం ఉండాలని చెబుతున్నాయి.


నెలల తరబడి సాగుతున్న ఇరాన్ యుద్ధం నుంచి తప్పుకునేందుకు ట్రంప్ సర్కారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మిలిటరీ చర్యలను తగ్గించిన అమెరికా ఇరాన్‌ను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. యుద్ధం కారణంగా అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలు అధ్యక్షుడు ట్రంప్ రేటింగ్స్‌కు గండికొడుతున్నాయి. ట్రంప్ విధానాలతో వచ్చే ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ ఈ పార్కుకు రావొద్దు.. యూకేలో భారతీయ విద్యార్థులకు వార్నింగ్

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..

Updated Date - Oct 16 , 2026 | 10:16 AM