రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు..
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:35 AM
రష్యాతో అమెరికా అధ్యక్షుడు ఆయిల్ డీల్ కుదుర్చుకున్నట్టు వచ్చిన వార్తలు చాలా మందికి షాక్ కలిగించాయి. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాతో అమెరికా అధ్యక్షుడు ఆయిల్ డీల్ కుదుర్చుకున్నట్టు వచ్చిన వార్తలు చాలా మందికి షాక్ కలిగించాయి. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రష్యాకు చమురు, ఇంధన విక్రయాల ద్వారా ఆదాయం పెరిగితే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగించేందుకు మరిన్ని వనరులు సమకూర్చుకోగలదని కీవ్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ఐరోపా దేశాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు రక్షణ సహాయం పెంచాలని, రష్యాపై ఒత్తిడి కొనసాగించాలని ఐరోపా నేతలను జెలెన్స్కీ కోరుతున్నారు. అలాగే అమెరికా ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తోందని, రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులను నిలిపివేయాలన్న వాషింగ్టన్ ఒత్తిడికి ఇకపై కట్టుబడి ఉండబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై రష్యా దాడులు కొనసాగుతున్నప్పుడు, తమ దేశం మాత్రమే దాడులను నిలిపివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు (Trump Russia oil deal).
మరోవైపు రష్యాతో యుద్ధం విషయంలో, అమెరికా అందించే ఉపగ్రహ సమాచార వ్యవస్థ సేవలపై ఉక్రెయిన్ సైన్యం ఎక్కువగా ఆధారపడుతోంది. ఇకపై ఆ సేవలపై అమెరికా పరిమితులు విధించనున్నట్లు వచ్చిన వార్తలు కూడా ఉక్రెయిన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా నుంచి నిఘా సమాచార సహకారం తగ్గే అవకాశం కూడా ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సేవలకు ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది (European support for Ukraine).
అమెరికాతో సంబంధాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జెలెన్స్కీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఐరోపా నేతలతో సమావేశమయ్యారు (Ukraine Russia conflict). నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో పాటు పలువురు ఐరోపా నాయకులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌కు మరింత రక్షణ సహాయం అందించాలని, రష్యాపై ఒత్తిడిని పెంచాలని కోరారు. యుద్ధాన్ని ముగించాలంటే రష్యాపై మరింత ప్రభావవంతమైన ఒత్తిడి అవసరమని, ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయాలని జెలెన్స్కీ పేర్కొన్నారు.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు