మళ్లీ ఈ పార్కుకు రావొద్దు.. యూకేలో భారతీయ విద్యార్థులకు వార్నింగ్
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:34 AM
బర్మింగ్‌హామ్‌కు సమీపంలోని ఓ పార్కు వద్ద కనిపించిన ముగ్గురు భారతీయ విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ శ్వేతజాతి యువకులు వార్నింగ్ ఇచ్చిన ఉదంతం యూకేలో ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బర్మింగ్‌హామ్‌కు సమీపంలోని ఓ పార్కు వద్ద కనిపించిన ముగ్గురు భారతీయ విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు శ్వేతజాతి యువకులు వార్నింగ్ ఇచ్చిన ఉదంతం కలకలం రేపుతోంది. సోలిహల్‌లోని మెరిడెన్ పార్క్ వద్ద ఈ ఉదంతం వెలుగు చూసింది.
స్థానిక మీడియా కథనాల, ఆ శ్వేతజాతి యువకులు తమని తాము చెల్మ్స్లీ వుడ్ పాట్రియట్స్ బృందంగా పిలుచుకుంటారు. మెరిడెన్ పార్కులో రాత్రి వెళ పిల్లలకు, మహిళలకు రక్షణగా గస్తీ నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతీయ యువకులను అక్కడి నుంచి బలవంతంగా పంపించేసిన వీడియోను వారే స్వయంగా తమ సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారు. ఆ తరువాత డిలీట్ చేశారు. జాత్యాహంకారంతోనే భారతీయ యువకులను టార్గెట్ చేశారన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి.
బృందంలోని ఓ వ్యక్తి భారతీయ విద్యార్థిని ఉద్దేశిస్తూ ఇంగ్లండ్‌కు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. మాస్టర్స్ చదవడానికి ఇంగ్లండ్ వచ్చామని భారతీయ యువకులు వివరించారు. తాము బర్మింగ్‌హామ్‌లో ఉంటామని చెప్పారు. రెండేళ్లుగా ఇంగ్లండ్‌లో ఉంటున్నామని ఓ భారతీయ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఈలోపు మరో వ్యక్తి జోక్యం చేసుకుని మళ్లీ ఆ పార్కు వద్దకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదే చివరి వార్నింగ్ అని స్పష్టం చేశారు.
రాత్రి వేళ వారు పార్కు వద్ద కనిపించడంతోనే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని శ్వేతజాతి యువకుల గ్రూప్ తరువాత చెప్పుకొచ్చింది. వాళ్లు తమ ప్రశ్నకు పొంతన లేని సమాధానాలు చెప్పారని కూడా తెలిపింది. పార్కులు కేవలం కుటుంబాలు, చిన్నారులకు మాత్రమేనని పేర్కొంది.
ఈ ఉదంతంపై స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విద్యార్థులది తప్పేమీ లేదని స్థానిక మాజీ కౌన్సిలర్ శేష్ శేషభట్టర్ తెలిపారు. వారు పార్కుకు వాకింగ్ కోసం వచ్చారని చెప్పారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు..
అమెరికా ఒరెగాన్‌లో పాఠశాలపై కాల్పులు.. ఐదుగురు మృతి..!