అమెరికా ఒరెగాన్లో పాఠశాలపై కాల్పులు.. ఐదుగురు మృతి..!
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:04 AM
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఓ పాఠశాలపై దుండగుడి కాల్పులు తీవ్ర విషాదాన్ని నింపాయి. బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్ సహా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.
బెండ్: అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఓ పాఠశాలపై దుండగుడి కాల్పులు తీవ్ర విషాదాన్ని నింపాయి. బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం మధ్యాహ్నం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్ సహా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో నిందితుడు దాడికి పాల్పడ్డాడు. పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఉన్న వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
అనంతరం పాఠశాలలోకి ప్రవేశించి అక్కడా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దుండగుడు పోలీసులపైనా కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. మృతుడిని ఓ 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అయితే, అతని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు, బెండ్ నగర అధికారుల ప్రకారం మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా, సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం పోలీసులు పాఠశాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. అన్ని తరగతి గదులను తనిఖీ చేస్తూ విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. నిందితుడు దాడికి పాల్పడటానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నీకేం పనీపాటా లేదా? మార్లిన్ ఫొటోపై పాక్ రక్షణ మంత్రిని ఆడుకున్న నెటిజన్లు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర