అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:20 AM
అమెరికాలోని ఇల్లినోయి రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయం లక్ష్యంగా భీకర దాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైఫిల్‌తో ఆలయంలో..
రైఫిల్ జామ్ కావడంతో తప్పిన ప్రమాదం
న్యూయార్క్, న్యూఢిల్లీ, అక్టోబరు 15: అమెరికాలోని ఇల్లినోయి రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయం లక్ష్యంగా భీకర దాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైఫిల్‌తో ఆలయంలో కాల్పులు జరపాలనుకున్న అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడి ఇంటి నుంచి రైఫిల్, పెద్ద ఎత్తున తూటాలు, మ్యాగ్జిన్లు, తీవ్రవాద సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. పాలటైన్‌కు చెందిన ఈ యువకుడు రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రవాద భావజాలంతో ప్రభావితం కావడంతో పాటు హిందువులంటే ద్వేషం పెంచుకున్న పపోరాకిస్ ఈ నెల 11న అరోరా ప్రాంతంలోని దేవాలయంలో కాల్పులు జరపాలనుకున్నాడు. సెలవుదినం కావడంతో భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయితే కాల్పులు జరిపేందుకు పపోరాకిస్ తెచ్చిన రైఫిల్ జామ్ కావడంతో కుట్ర విఫలమై ఇంటికి తిరిగి వెళ్లాడు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. కుట్ర ఘటన తీవ్ర కలవరానికి గురి చేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల భద్రతకు, హిందూ దేవాలయాల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.