నీకేం పనీపాటా లేదా? మార్లిన్ ఫొటోపై పాక్ రక్షణ మంత్రిని ఆడుకున్న నెటిజన్లు
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:03 PM
పాకిస్తాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ ఆసిఫ్ ఖవాజాను నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఆయన చేసిన ఓ పనే అందుకు కారణం. దివంగత హాలీవుడ్ దిగ్గజ నటి మార్లిన్ మన్రోకు చెందిన ఒక ఏఐ ఇమేజీని ఎక్స్‌లో ఖవాజా రీపోస్ట్ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ ఆసిఫ్ ఖవాజాను నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఆయన చేసిన ఓ పనే అందుకు కారణం. దివంగత హాలీవుడ్ దిగ్గజ నటి మార్లిన్ మన్రోకు చెందిన ఒక ఏఐ ఇమేజీని ఎక్స్‌లో ఖవాజా రీపోస్ట్ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు. 1950లో వింటేజ్ హోటల్ బయట క్లాసిక్ కార్ల మధ్యలో మన్రో నిల్చున్నట్లు ఏఐలో ఆ ఫొటోను రూపొందించారు. ‘1950వ దశకానికి చెందని ఒక ఇమేజ్ ఆ ఫొటోలో ఉంది. అదేదో గుర్తుపట్టండి. జాగ్రత్తగా పరిశీలించండి. మన్రో తన ఎడమ చేతి రిస్ట్కు ఒక స్మార్ట్ వాచ్ ధరించి ఉన్నారు. ఆ కాలంలో స్మార్ట్ వాచీలు లేవు’ అని ఖవాజా ఆ పోస్టులో పేర్కొన్నారు. తర్వాత ఆయనపై ట్రోలింగ్ ప్రారంభమైంది.
‘ఇప్పటికే మీ దేశం (పాకిస్తాన్) అంతర్గత కలహాలు, అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, భద్రతా సవాళ్లు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అలాంటి సమయంలో ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి ఆ ఫొటోలో ఏముంది, ఈ ఫొటోలో ఏముంది అంటూ సిల్లీ ప్రశ్నలు వేయడమేంది?’ అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ‘ఖవాజా! రాత్రి పూట తాగడం ఆపివేయండి. మొత్తం ప్రపంచం ముందు పాకిస్తాన్‌ను మీరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీకు సిగ్గూశరం, మర్యాద అనేది లేదు’ అని అఫ్గానిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ బుర్హానుద్దీన్ విమర్శించారు. ‘మీ పదవికి మీరు అనర్హులుగా భావిస్తే, ఖవాజాను గుర్తు చేసుకోండి’ అని మరో యూజర్ పేర్కొన్నారు. తనపై విపరీతమైన ట్రోలింగ్ రావడంతో ఖవాజా ఆ ఫొటోను తొలగించారు.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ