Share News

మోసపూరిత కాల్స్‌కు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 08:49 PM

స్పామ్, మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఎవరి పేరు ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మోసపూరిత కాల్స్‌కు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు!
Spam Call Prevention

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ వినియోగదారులను నిత్యం వేధించే లోన్లు, ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ వంటి స్పామ్, మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వెనుక ఎవరి పేరు ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్లు ఈ కొత్త వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


యూనిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌లో చేసిన సవరణల ద్వారా 'కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్' (CLI) నిర్వచనాన్ని ప్రభుత్వం అప్‌డేట్ చేసింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 'కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్' (CNAP) సేవలను అమలు చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారం.. మీ ఫోన్‌కు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు, ఆ నంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేకపోతే, టెలికాం ఆపరేటర్ల డేటాబేస్ నుంచి సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారికంగా రిజిస్టర్ చేయబడిన పేరు నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉంటే, మీరు ఏ పేరుతో సేవ్ చేశారో అదే స్క్రీన్ పై ప్రదర్శితమవుతుంది.


ఇక విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు సంబంధించి మొబైల్ స్క్రీన్‌పై కేవలం 'ఇంటర్నేషనల్ కాల్' (International Call) అని మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతానికి 4జీ, అంతకంటే ఆధునిక నెట్‌వర్క్‌ల వినియోగదారుల కోసం ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి రానుంది. 2జీ, 3జీ వంటి పాత నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్‌ల విషయంలో త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాలు, టెలికాం సేవలు సజావుగా సాగేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు టెలికాం శాఖ (DoT) వెల్లడించింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఫేక్ కాల్స్ మోసాలు గణనీయంగా తగ్గుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 15 , 2026 | 09:04 PM