Share News

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:34 PM

ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలు కేవలం అంకెలకు మాత్రమే పరిమితం కాదని, అది క్రీడా రంగంలో దేశ శక్తికి ప్రతీకని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన అథ్లెట్లను ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ప్రధాని మోదీ సన్మానించారు.

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ
PM Modi Honours Athletes

స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలు కేవలం అంకెలకు మాత్రమే పరిమితం కాదని, అది క్రీడా రంగంలో భారత దేశ శక్తికి ప్రతీకని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన అథ్లెట్లను ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ప్రధాని మోదీ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీర్తి తెచ్చిన అథ్లెట్లందరినీ అభినందిస్తూ.. ఈ విజయాలు మొత్తం 140 కోట్ల మంది దేశప్రజలందరివని మోదీ స్పష్టం చేశారు.


'ఈ పతకాలు కేవలం సంఖ్యలు కావు. ఇవి ఒక నూతన భారతదేశ శక్తిని ప్రతిబింబిస్తాయి. ప్రపంచ వేదికలపై మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేయడమే అత్యున్నత విజయం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రీడా వేడుకలో మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రశంసించారు. మహిళా అథ్లెట్లు ఏకంగా 11 స్వర్ణాలతో కలిపి మొత్తం 38 పతకాలను సాధించడం విశేషమని ప్రశంసించారు. అలాగే క్రికెట్, హాకీ జట్లతో పాటు ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఆర్చరీ క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.


యువ అథ్లెట్లు ప్రధానికి తమ సంతకం చేసిన జెర్సీలు, 17 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి కుంకుమ్ మోహోద్ విల్లును జ్ఞాపికగా బహుకరించారు. దేశ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్న ఈ విజేతలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరింతగా రాణించి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2026 టోర్నీలో 21 స్వర్ణాలతో సహా మొత్తం 85 పతకాలను సాధించి భారత్ అసాధారణ ప్రదర్శన కనబరిచింది.


ఇవి కూడా చదవండి...

17 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్

జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా సంచలన నిర్ణ‌యం

Updated Date - Oct 15 , 2026 | 07:41 PM