మదనపల్లెలో 'లేడీ డాన్' సులోచన అరెస్ట్.. 14 కేసులపై విచారణ..
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:46 PM
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భూ ఆక్రమణలు, మోసాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య, అక్టోబర్ 15: జిల్లాలోని మదనపల్లె పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణలు, మోసాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీషీట్ లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లెలోని నీరుగట్టుపల్లెకు చెందిన సులోచనపై వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 14 కేసులు ఉన్నట్లు సమాచారం. అమాయకులను మోసం చేయడం.. భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ఆమెపై నమోదైనట్లు తెలుస్తోంది. మదనపల్లె వన్టౌన్, టూటౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. పలు నేరారోపణల నేపథ్యంలో సులోచనను అదుపులోకి తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
జిల్లా ఎస్పీ ధీరజ్, అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. సులోచనపై నమోదైన కేసులు, భూ ఆక్రమణలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న అనంతరం విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయా, ఇప్పటికే నమోదైన కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News