Share News

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:18 AM

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ అంతరాయాలపై ఆ శాఖ ఉన్నతాధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని తాను పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!
Revanth Reddy

  • కరెంటు కోతలపై విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు సీఎం తీవ్ర హెచ్చరిక

  • పంటలను కాపాడేందుకు విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచాలని ఎన్నిసార్లు చెప్పాలి?

  • కరెంటు ఉత్పత్తిని ఎందుకు పెంచటం లేదు?

  • కోతలకు రోజుకో కారణం చెప్పొద్దు

  • వచ్చే 20 రోజులు పంటలకు కీలకం

  • ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఆపొద్దు

  • ఎల్‌నినో అనేది కరోనా లాంటి విపత్తే

  • జూన్‌ దాకా అమలయ్యేలా యాక్షన్‌ప్లాన్‌

  • తాగునీటికి ఇబ్బందులు తలెత్తొద్దు

  • ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ అంతరాయాలపై ఆ శాఖ ఉన్నతాధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని తాను పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు తగిన విధంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారటం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించను. అవసరమైతే విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌, జెన్‌కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్‌ లను, ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేస్తా’ అంటూ సీఎం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్‌, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు వివరించారు.


ఈ సందర్భంగా విద్యుత్‌ అంతరాయాలపై సీఎం స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదన్నారు. ఈ క్రమంలోనే, తాను ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా పరిస్థితులు మారకపోవటంపై అధికారుల మీద విరుచుకుపడ్డారు. విద్యుత్‌ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్‌ సరఫరా చేయాలని, పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్‌ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలన్నారు.


ఎల్‌నినో కూడా కరోనా లాంటి విపత్తేనని, ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అప్రమత్తం కాకపోతే సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేసి, సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మళ్లీ వానలు పడే వరకూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే జూన్‌ వరకు అవసరమైన యాక్షన్‌ప్లాన్‌ను ప్రతి శాఖ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయలన్నారు.


తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తవద్దు

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు.. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.


ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్‌-1, గ్రూప్‌-2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.


గ్రామసభలు, కళాజాతలతో ప్రజల్లో అవగాహన

కళాజాతల ద్వారా ప్రజలకు ఎల్‌నినో ప్రభావాన్ని వివరించాలని, నీరు, విద్యుత్‌ పొదుపుతో పాటు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు ఈ విపత్తు తీవ్రతను వివరించాలని, దసరా నుంచి దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్‌

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 04:18 AM